Amitabh Bachchan: పేదలకు నేను చేసిన సాయమా?... ఇదిగో ఇదే: ప్రశ్నించిన యువతికి అమితాబ్ బచ్చన్ ఘాటు సమాధానం!

Amitab Says Helped Many People in These Times
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమితాబ్
  • పేదలకు ఏం సాయం చేశారని ప్రశ్న
  • చెప్పుకునే సమయం వచ్చిందన్న అమితాబ్
ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి, తాజాగా కోలుకుని, ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సోషల్ మీడియాలో తనకు ఎదురైన ప్రశ్నపై ఘాటుగా స్పందించారు. ఓ యువతి అమితాబ్ పేదలకు చేసిన సాయం ఏంటని ప్రశ్నించగా, అమితాబ్ సమాధానం ఇస్తూ, సుదీర్ఘ పోస్ట్ ను పెట్టారు.

"నేను పేదలకు చేస్తున్న సాయాన్ని గురించి చెప్పడం లేదంటూ నేడు ఓ మహిళ ప్రశ్నించింది. చేసే సాయం గురించి ప్రచారం చేసుకోరాదని నేను నమ్ముతాను. అందుకే నేను చేసే సాయం గురించి చెప్పుకోను. కానీ, ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాను. గడచిన ఆరు నెలలుగా చిత్ర పరిశ్రమలోని పది వేల కార్మికుల కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తున్నాము.

ఇక ముంబై నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళుతున్న వలస కార్మికులకు 12 వేల జతల చెప్పులను అందించాము. నాసిక్ జాతీయ రహదారిపై వలస కార్మికుల కోసం ఆహార శిబిరాలను ఏర్పాటు చేసి, భోజనం, నీరు అందించాము. ప్రైవేటు విమానాలను బుక్ చేసి, వీలైనంత మందిని వారివారి ప్రాంతాలకు పంపించాము. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు 15 వేల పీపీఈ కిట్స్, వేలకొద్దీ మాస్క్ లను అందించాము" అని పేర్కొన్నారు.
Amitabh Bachchan
Corona Virus
Question
Help

More Telugu News