Guntur District: గుంటూరు జిల్లాలో దారుణం.. అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టరుతో తొక్కి చంపిన వైనం!

woman killed in Gunturu dist for not give back money
  • రెండున్నర ఎకరాలు తాకట్టు పెట్టి రూ.3.80 లక్షల అప్పు
  • వడ్డీతో సహా చెల్లించాలంటూ పట్టు
  • నెమ్మదిగా చెల్లిస్తామని చెప్పడంతో ట్రాక్టరుతో తొక్కించి చంపిన నిందితుడు
గుంటూరు జిల్లా నకిరేకల్లు శివారులోని శివాపురం తండాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. పొలం తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ట్రాక్టరుతో తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రమావత్ మంత్య్రానాయక్ , మంత్రుబాయి (55) దంపతులు తమకున్న రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు.

సాగుతోపాటు ఇతర అవసరాలకు రెండేళ్ల క్రితం వీరు నకిరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద పొలం తాకట్టుపెట్టి రూ. 3.80 లక్షలు అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించాలంటూ గత కొంతకాలంగా శ్రీనివాసరెడ్డి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. లేకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరించాడు.

ఈ క్రమంలో బాధిత దంపతులు పొలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి ట్రాక్టరుతో తండాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించాడు.  అయితే, పొలం సాగు చేసుకుని కొంచెంకొంచెంగా అప్పు తీరుస్తామని చెప్పినా వినిపించుకోలేదు.

ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ మొదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాసరెడ్డి తన ట్రాక్టరుతో మంత్రుబాయిని తొక్కించేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో నిందితుడు అదే ట్రాక్టరుతో అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు.
Guntur District
tribal Woman
Tractor
Murder
Andhra Pradesh

More Telugu News