KK Singh: సుశాంత్ ప్రమాదంలో ఉన్నాడని ఫిబ్రవరిలోనే ముంబయి పోలీసులను అప్రమత్తం చేశా: కేకే సింగ్
- వీడియో రిలీజ్ చేసిన సుశాంత్ తండ్రి
- తన ఫిర్యాదును ముంబయి పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
- సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా చర్యలు లేవని ఆవేదన
- అందుకే బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. ఈ అంశంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆసక్తికరమైన వీడియో రిలీజ్ చేశారు. తన కుమారుడు సుశాంత్ కు ప్రమాదం పొంచి ఉందని ఫిబ్రవరిలోనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశానని కేకే సింగ్ ఆ వీడియోలో వెల్లడించారు.
ఫిబ్రవరి 25న బాంద్రా పోలీసులకు సుశాంత్ కు ముప్పు ఉందన్న సంగతి చెప్పానని, కొందరు వ్యక్తుల పేర్లు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలని కోరానని వివరించారు. కానీ వారు స్పందించలేదని, కనీసం సుశాంత్ మరణించిన తర్వాత కూడా వారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కేకే సింగ్ ఆరోపించారు. అందుకే తాను బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.