Pithani Sudhrath: సుశాంత్ తో పాటు ఇంట్లో ఉంటున్న సిద్ధార్థ్ తెలుగువాడే!

Sidharth who was living with Sushanth in Mumbai house is a Telugu guy
  • సిద్ధార్థ్ పూర్తి పేరు పితాని సిద్థార్థ్
  • సినిమాలపై మోజుతో జైపూర్ చేరిక
  • సిద్ధార్థ్ టాలెంట్ గుర్తించి తన టీమ్ లో చోటిచ్చిన సుశాంత్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ ను హత్యచేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే సుశాంత్ రూమ్ లాక్ చేసుకున్న సంగతి ఆయన సోదరికి చెప్పిన సిద్ధార్థ్ తెలుగువాడే. దగ్గరుండి తలుపులు తెరిపించింది కూడా సిద్ధార్థే.

సిద్ధార్థ్ పూర్తిపేరు పితాని సిద్ధార్థ్. సినిమాలపై మోజుతో జైపూర్ లో ఓ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిద్ధార్థ్ ను సుశాంత్ గుర్తించాడు. అతడిలో ప్రతిభ ఉందని తెలుసుకుని తన బృందంలో ఒకడిగా అవకాశం ఇచ్చాడు. 2019 నుంచి పితాని సిద్ధార్థ్ హీరో సుశాంత్ తో పాటు అతడి ఇంట్లోనే ఉంటున్నాడు. సుశాంత్ నే కాదు, అతని కుటుంబ సభ్యులను కూడా ఆకట్టుకున్నాడు. సుశాంత్ కుటుంబీకులు సిద్ధార్థ్ ను బుద్ధా అని ముద్దుగా పిలుస్తారట.

ఇంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్న సిద్ధార్థ్... సుశాంత్, రియాల మధ్య రిలేషన్ వద్దకు వచ్చేసరికి మాటల్లో పొదుపు పాటిస్తున్నాడు. అసలు వాళ్ల గురించే తనకు తెలియదని, అలాంటప్పుడు ఏం జరిగిందో ఎలా చెప్పగలనని అంటున్నాడు. ప్రస్తుతం సుశాంత్ కేసును సీరియస్ గా విచారిస్తున్న బీహార్ పోలీసుల దృష్టి సిద్ధార్థ్ పై పడిందంటున్నారు.

ఈ క్రమంలో సిద్ధార్థ్ ముంబయి పోలీసులకు చేసిన ఈమెయిల్ సుశాంత్ కేసును ఆసక్తికరంగా మార్చింది. రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ కుటుంబీకులు తనను ఒత్తిడి చేస్తున్నారని సిద్ధార్థ్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరిపి సిద్ధార్థ్ నుంచి మరిన్ని వివరాలు రాబడితే ఈ కేసులో ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
Pithani Sudhrath
Sushant Singh Rajput
Suicide
Rhea
Mumbai
Bihar Police

More Telugu News