KCR: మాకు కానీ వైరస్ సోకితే.. కేసీఆర్, డీజీపీలే అందుకు బాధ్యత వహించాలి: భట్టి

kcr and dgp are responsible if coronavirus infect to opposition leaders
  • కేసీఆర్ చాలా పెద్ద కుట్రదారు
  • అరెస్టులకు ముందు పోలీసులు తమ వాహనాలను శానిటైజ్ చేయాలి
  • రాజస్థాన్ గవర్నర్ ఢిల్లీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలకు కరోనా అంటించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చాలా పెద్ద కుట్రదారుడని, ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి అని దుమ్మెత్తి పోశారు. ప్రశ్నించే వారికి కరోనా రావాలని శపించిన కేసీఆర్.. తనను విమర్శించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలకు కరోనా సోకితే అందుకు కేసీఆర్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

అరెస్టులకు ముందు పోలీసులు తమ వాహనాలను శానిటైజ్ చేయాలని అన్నారు. వాటి ద్వారా తమ నాయకులకు కరోనా సోకే ప్రమాదం ఉందని, అలా జరిగితే కనుక కేసీఆర్, డీజీపీలే అందుకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. అంతేకాదు, కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్డిగా పోలీసు వాహనాలను ఎక్కొద్దని సూచించారు.  రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఢిల్లీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని భట్టి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైనా ఉందన్నారు. ఇప్పటికే గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్‌లో కుట్ర చేసిన బీజేపీ ఇప్పుడు రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెరలేపిందని భట్టి ఆరోపించారు.


మరో నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అన్నారు. కాగా, నిన్న రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
KCR
Telangana
Congress
Mallu Bhatti Vikramarka
Corona Virus
TS DGP

More Telugu News