avanti: అందుకే నాగబాబుపై రఘురామకృష్ణ రాజు గెలిచారు: మంత్రి అవంతి

raghurama krishnam raju wins as a mp with jagan support says avanti
  • ఎంపీగా గెలిపించిన సీఎంపై విమర్శలు చేయొద్దు
  • మా పార్టీ నుంచి గెలిచారు
  • టీడీపీ కంటే ఎక్కువగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
  • రాజధానిగా విశాఖ వద్దని చెప్పడానికి మీరెవరు?
ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణ రాజు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస రావు స్పందించారు. సీఎం వైఎస్‌ జగన్ భిక్షతో రఘురామకృష్ణరాజు ఎంపీ అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

జగన్‌ వల్లే జనసేన నేత నాగబాబుపై ఆయన గెలుపొందారని అవంతి చెప్పారు. ఎంపీగా గెలిపించిన సీఎంపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు  టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఏపీ రాజధానిగా విశాఖ వద్దని చెప్పడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే చంద్రబాబు నాయుడిని విశాఖ‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్నారని ఆయన అన్నారు.

వైసీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలని అవంతి చెప్పారు. నలంద కిశోర్‌ అనారోగ్యంతో మృతి చెందారని, ఆయన మరణాన్ని కూడా చంద్రబాబు  రాజకీయం చేస్తున్నారని అవంతి విమర్శించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కుటుంబాన్ని టీడీపీ నేత లోకేశ్‌‌ పరామర్శించారని, మరి ఇప్పుడు కిశోర్‌ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు.
avanti
raghurama krishnam raju
YSRCP
nagababu

More Telugu News