Namo: 'నమో' చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి
- జయరామ్ ప్రధాన పాత్రలో సంస్కృత చిత్రం
- కుచేలుడి పాత్ర పోషించిన జయరామ్
- అవార్డులు గ్యారంటీ అంటూ దీవించిన చిరంజీవి
మలయాళ నటుడు జయరామ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'నమో'. ఈ చిత్రాన్ని సంస్కృత భాషలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆన్ లైన్ లో ఆవిష్కరించారు. ఈ సినిమా కోసం తనను తాను అద్భుతంగా మలుచుకున్నాడని జయరామ్ ను అభినందించారు. పాత్రలో మమేకమైన తీరు అద్భుతం అని కొనియాడారు. 'నమో' చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు.
"సోదరా జయరామ్, నీ నటనతో తప్పకుండా ప్రజల హృదయాలను గెలుచుకుంటావు, అలాగే అవార్డులను కూడా!" అంటూ చిరంజీవి ఆశీస్సులు అందజేశారు. ఈ చిత్రంలో జయరామ్ కుచేలుడి పాత్రలో కనిపిస్తారు. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడి జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి విజీష్ మణి దర్శకుడు. అనస్వర చారిటబుల్ ట్రస్ట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.