Rana: మిహీకా వాళ్ల ఇల్లు మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది: రానా

Rana tells Miheeka house just three kilometers away from his house
  • త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న రానా
  • ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం
  • మంచి దంపతులమవుతామంటున్న రానా
టాలీవుడ్ బ్రహ్మచారి దగ్గుబాటి రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను మనసిచ్చిన మిహీకా బజాజ్ తో రానా పెళ్లి ఆగస్టు 8న జరగనుంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగులు లేకపోవడంతో రానా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, పలు వివరాలు తెలిపారు.

"నేను పెళ్లీడుకు వచ్చినట్టు భావిస్తున్నాను. అందుకే ఓ ఇంటివాడ్ని కావాలని నిశ్చయించుకున్నాను. నా కాబోయే భార్య మిహీకా, మేము ఒకే ప్రాంతంలో ఉంటున్నాం. మిహీకా వాళ్ల ఇల్లు మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పటివరకైతే అంతా సాఫీగానే నడుస్తోంది. మిహీకా ఎంతో మంచి అమ్మాయి. మేమిద్దరం మంచి దంపతులం అవుతామని అనుకుంటున్నా. వ్యక్తిగతంగా ఈ ఘడియలు నా జీవితంలోకెల్లా ఉజ్వలమైనవి. మిహీకాతో పరిణయం గొప్పగా అనిపిస్తోంది" అంటూ వివరించారు.

అంతేకాదు, ఇటీవల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత తెరపైకివచ్చిన బంధుప్రీతి అంశంపైనా రానా స్పందించారు.

"భారతీయ సంస్కృతిలో కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుటుంబం అంటే ఏమిటి? అనే విషయం ప్రాతిపదిక మీదనే బంధుప్రీతి అనేది మొదలవుతుంది. ఓ కుటుంబంలో కష్టపడి పనిచేసే తండ్రి ఉంటే, తాను సాధించిన ఫలితాలను ఇతర కుటుంబ సభ్యులకు అందిస్తాడు. అది జ్ఞానం రూపేణా కావొచ్చు, ధన రూపేణా కావొచ్చు. ఆ విధంగా మనం కూడా అందులో భాగస్వాములం అవుతాం. దీన్ని కాదనుకుని నేను వెళ్లలేను. పైగా అది ఎంతో బాధ్యతతో కూడిన విషయం" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.
Rana
Miheeka Bajaj
Wedding
Tollywood
Nepotism

More Telugu News