Somireddy Chandra Mohan Reddy: మీరు చెప్పిందే జరగడానికి ఇదేమీ నియంత పాలన కాదు... ప్రజాస్వామ్యం!: జగన్ సర్కారుపై ధ్వజమెత్తిన సోమిరెడ్డి

  • ప్రభుత్వ పాలన గాడి తప్పిందంటూ వ్యాఖ్యలు
  • సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆ విషయం రుజువైందన్న సోమిరెడ్డి
  • కేసుల్లో తీర్పులు వస్తే జైలుకెళ్లేది అధికారులేనని ఉద్ఘాటన
Somireddy slams YS Jagan government and officials

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, రాజ్యాంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో రుజువైందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంలో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏపీలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే మీ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది అంటూ జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు.

"న్యాయ వ్యవస్థతో మాకు సంబంధం లేదు, రాజ్యాంగం మాకు అక్కర్లేదు అంటూ మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఇదేమీ నియంత పాలన కాదు... ఇది ప్రజాస్వామ్య దేశం అని మర్చిపోవద్దు" అంటూ హితవు పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి ఏపీ అధికారులను కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

"మీరు పాలకులకు బానిసల్లా ప్రవర్తిస్తున్నారు. రేపు కేసుల్లో తీర్పులు వస్తే జైలుకు వెళ్లేది పాలకులు కాదు... మీరే. అధికారులే శిక్ష అనుభవిస్తారు. ఏదేమైనా రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంటే కళ్లు మూసుకుని వాటిని అమలు చేసే హక్కు మీకెవరిచ్చారని అధికారులను అడుగుతున్నా" అంటూ తీవ్రంగా స్పందించారు.


More Telugu News