Jagan: రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచుతూ జగన్ కీలక నిర్ణయం

Jagan orders to increase state level Covid hospitals
  • రాష్ట్ర స్థాయి ఆసుపత్రులను కనీసం 10కి పెంచాలి
  • వైద్యులపై ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి
  • కోవిడ్ ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచాలి
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచారు. దీనివల్ల వైద్యులపై పని ఒత్తిడి తగ్గుతుందని... ఇదే సమయంలో పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలపై ఈరోజు  జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర కీలక అధికారులు హాజరయ్యారు.

సమావేశం సందర్భంగా కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టెస్టుల సంఖ్యను పెంచుతున్నామని... రోజుకు 35 నుంచి 45 వేల వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల సరిహద్దులను తెరవడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైద్యులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతులు, నాణ్యమైన సేవల పరంగా ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఆదేశించారు. సేవల నాణ్యతను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు చేయాలని చెప్పారు.

రాష్ట్రస్థాయి కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 5 నుంచి కనీసం 10కి పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని జగన్ తెలిపారు. జిల్లాల్లో ఉన్న 84 కరోనా ఆసుపత్రులపై కూడా సదుపాయాలను పెంచాలని ఆదేశించారు. కరోనాపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు. వైద్యసాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలని తెలిపారు. 85 శాతం మంది ప్రజలకు ఇళ్లలోనే కరోనా నయమవుతోందని చెప్పారు. టెలీమెడిసిన్ పై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించాలని ఆదేశించారు.
Jagan
YSRCP
Corona Virus

More Telugu News