Reah Chakraborty: సుశాంత్ ఆత్మహత్యపై తొలిసారి స్పందించిన రియా చక్రవర్తి

Reah Chakraborty responds first time on Sushant demise
  • ఇటీవల సుశాంత్ ఆత్మహత్య
  • రియా చక్రవర్తితో అనుబంధంపై ప్రచారం
  • భావోద్వేగాలతో బహిరంగ లేఖ వెలువరించిన రియా
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సుశాంత్ తో ప్రేమలో ఉందంటూ నటి రియా చక్రవర్తి పేరు కూడా ఈ సందర్భంగా ఎక్కువగా వినిపించింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని, అంతలోనే సుశాంత్ బలవన్మరణం చెందాడంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి ఇప్పటివరకు స్పందించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇన్నాళ్ల మౌనం తర్వాత ఆమె తొలిసారిగా తన మనసులోని బాధను తీవ్రభావోద్వేగాల నడుమ వెల్లడి చేసింది.

"నాలో చెలరేగుతున్న భావోద్వేగాలకు సమాధానం చెప్పేందుకు ఇప్పటికీ తడబడుతూనే ఉన్నా. మరమ్మతులు చేయడానికి వీల్లేని విధంగా నా హృదయం మొద్దుబారిపోయింది. నాకు ప్రేమ పట్ల నమ్మకం కలిగించింది.. దాని శక్తి ఏమిటో తెలిపింది నువ్వే. ఓ చిన్న గణిత సమీకరణంతో జీవిత పరమార్థాన్ని ఎలా విడమర్చవచ్చో నేర్పింది నువ్వే. ఈ పాఠాలను నీ నుంచి రోజూ నేర్చుకుంటానని నీకు ప్రామిస్ చేశాను. నువ్విక్కడ లేనప్పుడు నేనెప్పటికీ నేర్చుకోలేను.

నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు అత్యంత ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నావు. నీకు ఆ చంద్రుడు, తారకలు, పాలపుంతలు స్వాగతం పలికి ఉంటాయేమో! అత్యంత గొప్ప భౌతికవేత్తకు స్వాగతం అంటూ చేతులు చాచి పిలిచుంటాయేమో! పరవళ్లు తొక్కే ఆనందం, సహానుభూతితో ఓ గొప్ప తారగా వెలిగిపోవాల్సిన వాడివి. కానీ అందనంత దూరాలకు వెళ్లిపోయావు. నిన్ను నా వద్దకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ఈ ప్రపంచం నమ్మలేనంత సుందరుడివి నువ్వేనని అనుకునేదాన్ని. మన మధ్య చిగురించిన ప్రేమను వెల్లడించడానికి మాటలు చాలడంలేదు. నువ్వు చెబుతుండేవాడివి... అది మనిద్దరినీ మించినదని. దానర్థం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. ప్రతి విషయాన్ని విశాల హృదయంతో చూసేవాడివి. ఇప్పుడు మన ప్రేమ కూడా ఎంతో ప్రత్యేకమైనదని చూపావు. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సుషీ. ఈ 30 రోజుల ఎడబాటు బహుశా జీవితకాలపు ప్రేమ అవుతుందేమో. నిత్యం నీ జ్ఞాపకాలతో ఎప్పటికీ నీ దాన్నే!... కడవరకు, ఆ తర్వాత కూడా!" అంటూ ఎంతో భావుకతతో స్పందించింది.
Reah Chakraborty
Sushant Singh Rajput
Suicide
Bollywood

More Telugu News