Jio: జియోలో మరో పెట్టుబడి... ఇప్పుడిక క్వాల్ కామ్ వంతు!
- 0.15 శాతం వాటా కోసం రూ. 730 కోట్లు
- 12 వారాల వ్యవధిలో 11 కంపెనీల నుంచి ఇన్వెస్ట్ మెంట్
- మొత్తం 1.18 లక్షల కోట్లు దాటిన పెట్టుబడులు
ఏప్రిల్ 22 నుంచి కేవలం 12 వారాల వ్యవధిలో 11 కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, సుమారు 1.17 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను రాబట్టిన రిలయన్స్ అధీనంలోని జియో ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు మరో కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జియో ప్లాట్ ఫామ్స్ లో 0.15 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ. 730 కోట్లను క్వాల్ కామ్ ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించిన రిలయన్స్, దీంతో జియో ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు రూ. 1,18,318.45 కోట్లకు చేరుకున్నాయని ప్రకటించింది.
కాగా, క్వాల్ కామ్, టెక్నాలజీ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ క్వాల్ కామ్ కు ఆఫీసులున్నాయి. ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్స్ లో ఫేస్ బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్ టన్, పీఐఎఫ్, ఇంటెల్ కాపిటల్ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.