ఏకంగా ఎస్ బీఐ పేరిట నకిలీ బ్రాంచ్ నే సృష్టించిన ఘనులు!

Three youth creates fake bank branch in Tamilnadu
  • తమిళనాడులో ఘటన
  • బ్యాంకు పూర్వ ఉద్యోగి కుమారుడే ప్రధాన సృష్టికర్త
  • నకిలీ బ్యాంకు శాఖలో ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు
బ్యాంకు లావాదేవీల పేరిట ఆర్థిక మోసాలు అందరికీ తెలిసిందే. అయితే మోసాలు చేయడం కోసం కొందరు దేశముదుర్లు ఏకంగా ఓ నకిలీ బ్యాంకు శాఖనే సృష్టించారు! ఈ ఘటన తమిళనాడులో జరిగింది. బ్యాంకు పూర్వ ఉద్యోగి కుమారుడు, అతని స్నేహితులు ఇద్దరు ఈ ఘరానా మోసంలో భాగస్వాములు. కడలూరు జిల్లా పన్రూటి ప్రాంతంలో నివసించే కమల్ బాబు ఈ నకిలీ బ్యాంకు ప్రధాన సృష్టికర్త.

కమల్ బాబు తల్లి ఓ బ్యాంకులో పనిచేసి రెండేళ్ల కిందట రిటైరైంది. కమల్ బాబు స్నేహితుల్లో ఒకరు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తుండగా, మరో స్నేహితుడు రబ్బర్ స్టాంపులను తయారుచేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరికతో భారతీయ స్టేట్ బ్యాంకు-నార్త్ బజార్ పేరుతో ఓ బ్రాంచ్ ను తెరిచారు. 3 నెలల పాటు ఎవరికీ అనుమానం రాకుండా కార్యకలాపాలు సాగించినా, చివరికి ఓ ఖాతాదారుడికి అనుమానం రావడంతో వీళ్ల గుట్టు రట్టయింది.

ఆ ఎస్ బీఐ ఖాతాదారుడి ఫిర్యాదుతో అధికారులు విచారణ జరపగా, ఓ నకిలీ బ్రాంచ్ దర్శనమివ్వడంతో దిగ్భ్రాంతి చెందారు. పన్రూటిలో ఉన్నది రెండే బ్రాంచ్ లు అయితే, ఈ మూడో ఎస్ బీఐ బ్రాంచ్ ఎక్కడ్నించి వచ్చిందని విస్తుపోయారు. ఆ బ్రాంచ్ లోకి వెళ్లిన అధికారులకు అందులోని ఏర్పాట్లు ఆశ్చర్యం కలిగించాయి. ఒరిజనల్ బ్రాంచ్ కు తీసిపోని రీతిలో అన్ని వ్యవస్థలు అందులో ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్రాంచ్ నుంచి పెద్దగా లావాదేవీలు జరగకపోవడంతో కస్టమర్లెవరికీ నష్టం జరగలేదు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమల్ బాబును, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Bank Branch
Fake
Tamilnadu
Panrooti
SBI
Police

More Telugu News