Kurnool District: కరోనా సోకిందన్న భయంతో స్వర్ణకారుడి ఆత్మహత్య.. తీరా ఫలితాల్లో నెగటివ్!

goldsmith hanged himself amid coronavirus fear
  • రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన వ్యక్తి
  • కరోనా సోకిందన్న అనుమానంతో శాంపిళ్లు ఇచ్చిన వైనం
  • ఆపై ఇంటికొచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య
తనకు కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో ఓ స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పాతబస్తీ కేవీఆర్ గార్డెన్‌కు చెందిన స్వర్ణకారుడు (46) భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా మార్చి నెల నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయన రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు.

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన అతడు.. కరోనా భయంతో బుధవారం ఓ ప్రైవేటు ల్యాబులో పరీక్ష కోసం నమూనాలు ఇచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ల్యాబు వద్దే ఉండగా, స్నానం చేసి వస్తానంటూ ఇంటికెళ్లిన బాధితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతడికి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగటివ్ అని వచ్చినట్టు తెలిసింది. అయితే, తనకు కరోనా సోకిందన్న భయంతోనే అతడు తొందరపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Kurnool District
goldsmith
hanged
Corona Virus

More Telugu News