నాలుగేళ్ల బాబును బోటులో వదిలేసి... హాలీవుడ్ నటి నయా రివీరా ఆత్మహత్య!
- బోటు అద్దెకు తీసుకుని నదిలోకి వెళ్లిన రివీరా
- బిడ్డకు లైఫ్ జాకెట్ వేసి, తాను ఆత్మహత్య
- మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు
మొత్తం 80 మంది రెస్క్యూ టీమ్, హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవల సాయంతో ఆమె కోసం గాలిస్తున్నారు. వీరిలో డైవర్లు కూడా ఉన్నారని ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆమె కోసం బుధవారమంతా గాలించామని, చీకటి పడిన తరువాత ఆపరేషన్స్ నిలిపి, గురువారం తిరిగి ప్రారంభించామని, ఇంకా నయా రివీరా ఆచూకీ లభించలేదని తెలిపారు. ఆమె బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ బోటును అద్దెకు తీసుకుంది. ఆపై తన కుమారుడితో కలిసి నదిలో విహారానికి వెళ్లింది.
ఆపై చాలా సేపటి తరువాత, మరొకరు బోటును తీసుకుని సరస్సులోకి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బోటులోని రివీరా కుమారుడు లైఫ్ జాకెట్ వేసుకున్న పరిస్థితుల్లో కనిపించాడు. ఆమె మాత్రం అందులో లేదని పోలీసు అధికారి ఎరిక్ బుశ్చోవ్ వెల్లడించారు. ఆమె మరణించి వుండవచ్చని, ఈ విషయాన్ని ఇప్పుడే స్పష్టం చేయలేమని అన్నారు.