కాసేపట్లో ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్టు.. కరోనా నేపథ్యంలో కొత్తగా వచ్చిన నిబంధనలు ఇవే!
- బంతికి ఉమ్మి పూస్తే 5 పరుగుల పెనాల్టీ
- కొవిడ్-19 సబ్ స్టిట్యూషన్ కు గ్రీన్ సిగ్నల్
- డీఆర్ఎస్ రివ్యూల పెంపు
ఉమ్మి నుంచి కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో... బంతిపై ఉమ్మి పూయడాన్ని ఐసీసీ నిషేధించింది. అయితే, ఉమ్మి పూయకుండా అలవాటు పడేందుకు ఇన్నింగ్స్ కు రెండు సార్లు అనుమతిస్తారు. రెండు హెచ్చరికలను జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఉమ్మి పూస్తే... పెనాల్టీ కింద బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు 5 పరుగులను ఇస్తారు. అయితే, బంతికి చెమటను పూసేందుకు ఐసీసీ అనుమతించింది.
మరోవైపు ద్వైపాక్షిక సిరీస్ లను స్థానిక అంపైర్లతోనే నిర్వహించనున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ లో ఉన్న స్థానిక అంపైర్లు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మరో కీలక నిబంధనను కూడా ఐసీసీ తీసుకొచ్చింది. కొవిడ్-19 సబ్ స్టిట్యూషన్ కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆట మధ్యలో ఏ ఆటగాడికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేేలితే... అతని స్థానంలో మరొక ఆటగాడిని అనుమతిస్తారు.
ఇదే సమయంలో డీఆర్ఎస్ రివ్యూల సంఖ్యను కూడా పెంచింది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ కు మూడు రివ్యూలు... వన్డేలు, టీ20ల్లో రెండేసి రివ్యూలకు ఛాన్స్ ఇచ్చింది. ఇదే సమయంలో టెస్టు జెర్సీలపై ఇప్పటి వరకు ఉంటున్న మూడు లోగోలకు అదనంగా మరో లోగోకు ఐసీసీ అనుమతినిచ్చింది.