Viral Videos: వర్క్‌ ఫ్రం హోంలో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసిన వ్యక్తి

Spanishman showers during live video meeting
  • స్పెయిన్‌లో ఘటన
  • బయటకు వెళ్లి తన కూతురిని తీసుకురావాల్సి ఉండడంతో హడావుడి
  • సమయం మించిపోతుండడంతో బాత్రూంలోకి ల్యాప్‌టాప్
  • ఉద్యోగం నుంచి రాజీనామా చేయాలన్న అధికారులు
కరోనా విజృంభణతో కార్యాలయాలను మూసివేసి, ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు యాజమాన్యాలు సూచిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇంట్లో నుంచి పనిచేస్తోన్న కొందరు ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్‌లో తోటి ఉద్యోగులతో మాట్లాడే సమయంలో హుందాగా వ్యవహరించకుండా చిక్కుల్లో పడుతున్నారు. ఆన్‌లైన్‌లో అధికారులతో మాట్లాడుతోన్న సమయంలో ఓ ఉద్యోగి  బాత్రూంలో స్నానం చేసిన ఘటన స్పెయిన్‌లోని కాంటాబ్రియాలో చోటు చేసుకుంది.

టోర్రెలావెగా కమ్యునిలో కౌన్సిలర్‌గా పనిచేస్తున్న బెర్నాడో బుస్టిల్లా ముఖ్యమైన విషయంపై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సమయంలో ఆ లైవ్ సమావేశం టీవీలోనూ ప్రసారమైంది. ఇటీవల ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం జరిగింది. అయితే, బయటకు వెళ్లిన తన కూతురిని బెర్నాడో ఇంటికి తీసుకురావాల్సి ఉండి, సమయం మించిపోతుండడంతో హడావుడి పడ్డాడు.

వెంటనే స్నానం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే, మీటింగ్‌లో చెబుతున్న విషయాలను వినాలన్న ఉద్దేశంతో తన లాప్‌టాప్‌ను కూడా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. తన వీడియో కనపడకుండా ఒక బటన్‌ నొక్కాల్సిందిపోయి, మరో బటన్ నొక్కాడు. అత‌ను స్నానం చేసిన తీరు అందరికీ క‌నిపించింది.

దీంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అతనితో మాట్లాడాలని వారు ప్రయత్నించినా, షవర్ నుంచి వస్తున్న నీళ్ల చప్పుడు వల్ల ఆయనకు వినపడక పట్టించుకోలేదు. చివరకు అత‌డి స్నేహితులు ఫోన్ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇక మీటింగును వాయిదా వేశారు. అతడిని వెంటనే రాజీనామా చేయాలని అధికారులు ఆదేశించారు.
Viral Videos
work from home
Lockdown

More Telugu News