Corona Virus: కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు 1100 మంది పేర్ల నమోదు!

Corona Vaccine Trails started
  • తొలి దశలో 375 మందిపై ప్రయోగం
  • ఆపై మిగతా 750 మందికి వ్యాక్సిన్
  • ఒక్కో దశ ఫలితాల విశ్లేషణకు 28 రోజుల సమయం
భారత్ బయోటెక్ తయారుచేసిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను పరీక్షించేందుకు 1,100 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తొలి, రెండవ దశల్లో వీరిపై ప్రయోగాలు నిర్వహించనున్నట్టు సంస్థ వెల్లడించింది. తొలి దశలో 375 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని, వారిని 125 మంది చొప్పున మూడు గ్రూపులుగా విభజించి, రెండు డోస్ లు ఇస్తామని, వారిపై వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, రెండో దశలో 750 మందిపై ప్రయోగాలు జరుపుతామని తెలియజేసింది.

తొలి దశ వ్యాక్సిన్ ఫలితాలను విశ్లేషించేందుకు కనీసం 28 రోజుల సమయం పడుతుంది. భారత ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ రావాలంటే, ఈ నెల 18 లోగా తొలి దశ టీకాలను వలంటీర్లకు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, తొలి దశ పరీక్షలు విజయవంతమైన వెంటనే వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు.

వాస్తవానికి ఏదైనా వ్యాక్సిన్ ను విడుదల చేయాలంటే, మూడు దశల్లో పరీక్షలు జరపాల్సివుంటుంది. ఈ మొత్తం విధానం నెలల తరబడి కొనసాగుతుంది. ట్రయల్స్ నిర్వహించేందుకు ఎంత సమయం పడుతుందని గతంలో మీడియా అడిగిన ప్రశ్నకు, 15 నెలల సమయం పడుతుందని భారత్ బయోటెక్ సమాధానం ఇచ్చింది. ఆపై గత నెల 25న తమ వ్యాక్సిన్, ఎలుకలు, చుంచులు, కుందేళ్లపై విజయవంతమైందని పేర్కొంది. 

ఆపై ఫేజ్ 1 హ్యూమన్ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు కోరగా, అవి లభించాయి. ఇక రెండో దశలో వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్లకు కరోనా సోకిందా? అన్న విషయాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించనున్నారు. కాగా, ఈ వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించేందుకు 12 ఇనిస్టిట్యూట్ లను ఐసీఎంఆర్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Corona Virus
Vaccine
Trails

More Telugu News