Arvind Kejriwal: ఢిల్లీలో కరోనా కేసులు లక్ష దాటినప్పటికీ.. భయపడాల్సిన అవసరం లేదు: కేజ్రీవాల్

No need to worry about corona says Kejriwal
  • కరోనా బారిన పడిన వారిలో 72 వేల మంది కోలుకున్నారు
  • దేశంలో తొలి ప్లాస్మా బ్యాంకును ప్రారంభించింది మా ప్రభుత్వమే
  • కరోనా రోగులకు రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలి
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్షను దాటింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, కేసులు లక్ష దాటినా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా బారిన పడిన వారిలో 72 వేల మంది కోలుకున్నారని చెప్పారు. 25 వేల యాక్టివ్ కేసుల్లో 15 వేల మంది ఇంటి వద్ద నుంచే చికిత్స పొందుతున్నారని తెలిపారు. హౌస్ ఐసొలేషన్ లో ఉంటూ కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలోనే మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకును తమ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు.

కరోనా బారిన పడిన వారి కోసం రక్తదానం చేయాలని కేజ్రీవాల్ విన్నవించారు. రక్తదానం చేస్తున్న వారు సరిహద్దుల్లో నిస్వార్థంగా పని చేస్తున్న సైనికులతో సమానమని చెప్పారు. ఢిల్లీలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందని తెలిపారు. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో నిన్న దాదాపు 9,900 కరోనా పడక గదులు మిగిలాయని తెలిపారు. నగరంలో మూడు ప్రధాన ఆసుపత్రులైన లోక్ నాయక్, గురు తేజ్ బహదూర్, రాజీవ్ గాంధీ ఆసుపత్రుల్లో ఐసీయూ పడక గదులు 169 శాతం పెరిగాయని చెప్పారు.
Arvind Kejriwal
Corona Virus

More Telugu News