Love Story: గుజరాత్ గ్యాంగ్ స్టర్ల మధ్య ముక్కోణపు ప్రేమకథ... పోలీసులను ఆశ్రయించిన లేడీ డాన్
- సూరత్ లో లేడీ డాన్ పై మాజీ ప్రియుడి దాష్టీకం
- మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని దాడి
- పారిపోయే ప్రయత్నంలో కాలు విరగ్గొట్టుకున్న మాజీ ప్రియుడు
రియల్ లైఫ్ లో సినిమా లాంటి ఘటన గుజరాత్ లో జరిగింది. ముగ్గురు క్రిమినల్స్ మధ్య ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. అసలు కథలోకి వెళితే... 22 ఏళ్ల భూరి అలియాస్ అస్మితాబా గోహిల్ ఓ లేడీ డాన్. సూరత్ లోని వరాచా ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ క్రిమినల్ రికార్డు సొంతం చేసుకుంది. కొన్నాళ్ల కిందటి దాకా సంజయ్ బాఘేలా అనే గ్యాంగ్ స్టర్ తో ఆమె ఎంతో సన్నిహితంగా మెలిగింది. అయితే కొన్నిరోజులుగా తన గ్యాంగ్ లోని రాహుల్ అనే గ్యాంగ్ స్టర్ తో స్నేహంగా మెలగడం ప్రారంభించింది. తనను అస్మితాబా పట్టించుకోకుండా, మరో యువకుడితో చనువుగా ఉండడాన్ని భరించలేని సంజయ్ బాఘేలా ప్రియురాలు అని కూడా చూడకుండా అస్మితాబాను చితకబాదాడు.
రాహుల్ నివాసంలో ఉందన్న సమాచారం అక్కడికి వెళ్లిన బాఘేలా ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు. అంతేకాదు, ఎవరితో డేటింగ్ చేసినా ఇలాగే కొడతానని బెదిరించాడు. దాంతో భయపడిపోయిన ఆ లేడీ డాన్ తన కొత్త ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. మరుసటి రోజు కూడా వచ్చిన బాఘేలా మరింత బీభత్సం సృష్టించాడు. అక్కడున్న రాహుల్ బైక్ ను ధ్వంసం చేశాడు.
దాంతో ఇంట్లోంచి బయటికి వచ్చిన అస్మితాబాపై మరోసారి చేయి చేసుకున్నాడు. అతడి దౌర్జన్యాన్ని భరించలేకపోయిన అస్మితాబా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అయితే, పోలీసుల రాకతో పారిపోయేందుకు ప్రయత్నించిన బాఘేలా కాలు విరగ్గొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.