Hyderabad: హైదరాబాద్‌లో బంగారు వ్యాపారి బర్త్ డే పార్టీ.. హాజరైన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు.. కరోనాతో వ్యాపారి మృతి

Gold Merchant Birth Day party Two minsters Attended
  • గత నెల 22న వ్యాపారి బర్త్ డే 
  • ఆ తర్వాత మూడు రోజులకే వ్యాపారి.. ఐదు రోజుల తర్వాత మరో వ్యాపారి మృతి
  • రహస్యంగా పరీక్షలు చేయించుకుంటున్న ప్రముఖులు
హైదరాబాద్‌లో కరోనా వైరస్ చెలరేగిపోతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. సడలింపులు ఇచ్చారు కదా అని విందులు, వినోదాల్లో మునిగి తేలుతూ సామాజిక దూరాన్ని గాలికి వదిలేస్తున్నారు. వారితో సహా పలువురి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నగరానికి చెందిన ఓ బంగారు వ్యాపారి ఇచ్చిన పార్టీకి ఏకంగా ఇద్దరు మంత్రులు హాజరు కావడం, ఆ తర్వాత కరోనాతో వ్యాపారి మరణించడంతో ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

హిమాయత్‌నగర్‌లో నివసించే ఓ బంగారు వ్యాపారి (63) పుట్టిన రోజు వేడుకలు గత నెల 22న ఘనంగా జరిగాయి. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు బంగారు వర్తకులు కలిసి మొత్తం 150 మందికిపైగా ఈ వేడుకకు హాజరయ్యారు.

పార్టీ జరిగిన రెండు రోజుల తర్వాత వ్యాపారి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గు, ఆయాసంతో బాధపడుతుండడంతో ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అనుమానించిన వైద్యులు మందులు రాసిస్తూనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మందులు వాడుతున్నా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో అనుమానించిన వ్యాపారి ఐదు రోజుల క్రితం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే, పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆ మరుసటి రోజే అతడు మరణించాడు.

ఆ తర్వాత ఐదు రోజులకే ఈ పార్టీలో పాల్గొన్న జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా ఐదు రోజుల క్రితం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనికి తోడు పార్టీకి హాజరైన వారిలో 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ వేడుకకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పుడీ విషయం తెలిసి వణికిపోతున్నారు. దీంతో వీరంతా రహస్యంగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.
Hyderabad
Gold merchant
Birth day party
Ministers

More Telugu News