Tammineni Sitaram: న్యాయస్థానాల నుంచి ఆదేశాలు తీసుకొస్తుంటే ప్రజలెందుకు, ప్రజాప్రతినిధులెందుకు?: స్పీకర్ తమ్మినేని అసంతృప్తి

Speaker Tammineni Sitaram opines recent Court rulings
  • ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు
  • కోర్టుల నుంచే పాలిస్తారా? అంటూ తమ్మినేని ప్రశ్నాస్త్రం
  • న్యాయస్థానాలపై వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కొన్ని హక్కులు, బాధ్యతలు ఇస్తూ కొన్ని హద్దులను కూడా నిర్ణయించిందని వెల్లడించారు. ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఈ ఏర్పాట్లు అని తెలిపారు. కానీ జోక్యం చేసుకుంటున్నారని, కోర్టుల నుంచే ఆదేశాలు తీసుకొస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విధానాలను మార్చేందుకు కోర్టుల జోక్యం కోరడం, కోర్టు ఆదేశాలతో "ఇది ఆపేయండి, అది నిలిపివేయండి" అంటూ చెబుతుంటే ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ప్రజాప్రతినిధులెందుకు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు? అసెంబ్లీ ఎందుకు? సీఎం ఎందుకు? అంటూ అసంతృప్తి వెలిబుచ్చారు.

"ఇవన్నీ అక్కర్లేదనుకుని మీరే న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిద్దామనుకుంటున్నారా? తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా అడుగుతున్నా... విజ్ఞులైన ప్రజానీకాన్ని, మేధావులను, న్యాయమూర్తులను, న్యాయవాదులను, విశ్లేషించగల మీడియా సోదరులను అడుగుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయనుకుంటే రాజ్యాంగ నిర్మాతలు ఈ తరహా పరిస్థితులకు కూడా ప్రత్యామ్నాయాలను రాజ్యాంగంలో రాసేవారేమో! ఇలాంటి తీర్పులు వస్తే ఏం చేయాలో వెసులుబాట్లు కూడా సూచించేవారేమో కానీ అలా జరగలేదు" అన్నారాయన.

తమ్మినేని సీతారాం ఇవాళ తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
Tammineni Sitaram
Courts
Rulings
Andhra Pradesh
YSRCP

More Telugu News