Ashok Babu: మండలిలో బొత్స వితండవాదంతోనే ద్రవ్య బిల్లు ఆగిపోయింది: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వివరణ

MLC Ashok Babu explains how Appropriation Bill got no approval in Council
  • ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు నిలిచిన వేతనాలు
  • టీడీపీనే కారణమంటున్న వైసీపీ
  • ద్రవ్యబిల్లుపై చర్చను అడ్డుకున్నది వైసీపీ నేతలేనన్న అశోక్ బాబు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆగిపోవడానికి కారణం టీడీపీయేనని, మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర పడకుండా చేసింది టీడీపీ సభ్యులేనని వైసీపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోండగా, దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వివరణ ఇచ్చారు.

అసెంబ్లీలో పాసైన బడ్జెట్ బిల్లు సహా రాజధాని బిల్లు, ఇంగ్లీషు మీడియం బిల్లు తదితర బిల్లులు మండలికి వచ్చాయన్నారు. బడ్జెట్ బిల్లు ప్రధానమైనది కాబట్టి, అది అసెంబ్లీ నుంచి వచ్చేదాక మిగతా బిల్లుల గురించి చర్చిద్దామని సమావేశాల ఆరంభంలో మండలి చైర్మన్ చెప్పారని వివరించారు. దీనికి వైసీపీ తరఫున సుభాష్ చంద్రబోస్, టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు ఫ్లోర్ లీడర్ల హోదాలో ఆమోదించారని తెలిపారు.

"ఆ రకంగా మేము చిన్న చిన్న మార్పులతో 9 బిల్లుల వరకు ఆమోదించాం. సాయంత్రం 4 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లు, ద్రవ్య బిల్లు అసెంబ్లీ నుంచి వచ్చాయి. దాంతో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టాలని ఆర్థికమంత్రి బుగ్గనను మండలి చైర్మన్ కోరారు. బుగ్గన పైకి లేవగా, పక్కనే ఉన్న మంత్రి బొత్స ఆర్థికమంత్రిని తట్టి కూర్చోబెట్టారు. ఈ బిల్లులు వద్దు, రాజధాని బిల్లులను చర్చించిన తర్వాత ఆ రెండు బిల్లును చర్చిద్దాం అంటూ బొత్స మండలి చైర్మన్ తో వితండవాదం చేశారు.

అక్కడి నుంచి ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. ముందు అంగీకరించిన విధంగా బిల్లులను ఆర్డర్ ప్రకారం చర్చిద్దామని మండలి చైర్మన్ చెప్పినా అధికార పక్షం వినలేదు. ఈ సమావేశాల ఉద్దేశం బడ్జెట్ ప్రవేశపెట్టడం కాబట్టి, దానికి సంబంధించిన బిల్లులపై చర్చిస్తే బాగుంటుందని చెప్పినా వినలేదు. 22 మంది మంత్రులు మండలిలోకి వచ్చి నానా యాగీ చేశారు. బూతులతో రెచ్చిపోయారు. బడ్జెట్, ద్రవ్య బిల్లులపై చర్చను ప్రారంభం కానివ్వకుండా అడ్డుకున్నారు. కావాలంటే దీనిపై సభా సమావేశాల మినిట్స్ తెప్పించుకుని చూసుకోవచ్చు. ఎవరిది తప్పో అర్థమవుతుంది" అంటూ స్పష్టం చేశారు.
Ashok Babu
Appropriation Bill
AP Legislative Council
Budget
YSRCP
Botsa Satyanarayana
Telugudesam

More Telugu News