Ayodhya Ram Mandir: అయోధ్యలో త్వరలో రామ మందిర నిర్మాణ పనులు.. మోదీకి ఆహ్వానం

Ram janmabhoomi trust invite PM Modi
  • ఇప్పటికే గ్రౌండ్ లెవలింగ్ పనులు పూర్తి
  • శ్రావణ మాసం చివరి రోజైన వచ్చే నెల 5న ముహూర్తం
  • రావడం వీలుకాకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ప్రారంభించాలంటూ ప్రధానికి లేఖ
అయోధ్యలో త్వరలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్యలో పర్యటించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖ రాసింది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయోధ్యలో పర్యటించి, రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అయోధ్య పర్యటన ప్రధానికి వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా శంకుస్థాపన చేయాలని ఆ లేఖలో కోరినట్టు దాస్ తెలిపారు.

రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ జరిగిన నేపథ్యంలో పనులను ప్రారంభించాలని భావిస్తున్న ట్రస్ట్.. శ్రావణమాసం చివరి రోజైన ఆగస్టు 5న నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు, ఆలయాన్ని నిర్మించే ప్రదేశంలో భూమిని చదును చేసే పనులు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అలాగే, రాళ్లను చెక్కే పని కూడా ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం రామ జన్మభూమి స్థలాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మందిర నిర్మాణం కోసం తన వ్యక్తిగత సొమ్ము నుంచి రూ. 11 లక్షలు విరాళంగా ఇచ్చారు.
Ayodhya Ram Mandir
Narendra Modi
Yogi Adityanath

More Telugu News