Guwahati: కుంకుమ, మెట్టెలు పెట్టుకోలేదని విడాకులు కోరిన భర్త... మంజూరు చేసిన హైకోర్టు!

Wife Didnot Wear Sindhoor Guwahati High Court Grants Divorce to a Man
  • గౌహతి హైకోర్టు ఆసక్తికర తీర్పు
  • భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమిది
  • కుంకుమ, మెట్టెలు పెట్టుకోకుండా అవివాహితలా ఉండటం తప్పే
  • విడాకులు మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం
ముఖానికి బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోని భార్య తనకు వద్దని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన గౌహతి హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఫ్యామిలీ కోర్టు, విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించగా, బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. హిందూ మహిళ, వివాహం తరువాత ముఖానికి సిందూరం, కాళ్లకు మెట్టలు ధరించడం సంప్రదాయమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమని, భర్త మనోభావాలను గౌరవించాలని, ఆ పని చేయలేకుంటే వివాహ బంధానికి అర్థం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

"కుంకుమ, మెట్టలు ధరించేందుకు ఇష్టపడటం లేదంటే, తాను అవివాహితనని ప్రపంచానికి తెలియజేయాలని ఆమె భావిస్తోంది. ఆమె పెళ్లిని అంగీకరించినట్టుగా అనిపించడం లేదు. వివాహ బంధాన్ని కొనసాగించడం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉంది" అంటూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

కాగా, వీరిద్దరికీ 2012 ఫిబ్రవరి 17న వివాహం జరుగగా, ఆపై కొంతకాలానికే విభేదాలు వచ్చాయి. భర్త తరఫు కుటుంబీకులతో కలిసి నివసించేందుకు ఆమె అంగీకరించలేదు. ఆపై 2013, జూన్ 30 నుంచి వారిద్దరూ విడిగానే ఉంటున్నారు. భర్తపై ఆమె గృహహింస కేసు కూడా పెట్టింది. ఆపై వివాహమైనట్టుగా ప్రపంచానికి తెలిపే కుంకుమ, మెట్టెలు తీసేసింది.
Guwahati
High Court
Sindhoor
divorce

More Telugu News