Mandali Buddaprasad: ముంపు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలా... ఏడాదిలో నిబంధనలేమైనా మారాయా?: మండలి బుద్ధప్రసాద్

Mandali Buddha Prasad questions YSRCP government
  • కృష్ణా నదికి, కరకట్టకు మధ్య భూములు కొంటున్నారని ఆరోపణలు
  • ఇది చట్ట విరుద్ధమన్న మండలి బుద్ధ ప్రసాద్
  • చెరువులు పూడ్చి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని వెల్లడి
పేదలకు ఇళ్ల స్థలాల అంశంపై టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ స్పందించారు. ముంపు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నదికి, కరకట్టకు మధ్య భూములు కొనుగోలు చేస్తున్నారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని విమర్శించారు. కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. కొక్కిలిగడ్డలో చెరువులను పూడ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

గత ప్రభుత్వం హయాంలో ఉండవల్లి గ్రామంలో ప్రజావేదిక నిర్మించారని, కానీ అది ఆర్సీ యాక్ట్ ను ఉల్లంఘిస్తోందంటూ ఇప్పటి ప్రభుత్వం కూల్చివేసిందని తెలిపారు. కృష్ణా నదీ ముంపు ప్రాంతంలో ఉందంటూ ప్రజావేదికను కూల్చేసి ఏడాది కాలం అయిందని, ఈ ఏడాదిలో ఏమైనా చట్టాలు మారాయా? అని ప్రశ్నించారు.

"ఈ ప్రాంతంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చదును చేస్తున్నామని, మట్టి పోస్తున్నామని చెబుతున్నారు. నదీ ప్రాంతంలో ఆ మట్టి నిలబడుతుందా? అసలు పోత మట్టిలో నిర్మాణాలు ఎలా చేస్తారు? అనుమతులు వస్తాయనుకుంటున్నారా? గతంలో వరదలు వచ్చినప్పుడు యడ్లంక వాసులు తమకు అవనిగడ్డలో స్థలాలు ఇవ్వాలని కోరితే మంత్రులు సరేనన్నారు. ఇప్పుడదే యడ్లంకలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస యోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి?" అంటూ ప్రశ్నించారు.
Mandali Buddaprasad
Lands
Undavalli
YSRCP
Andhra Pradesh

More Telugu News