Insurance: రైతులకు శుభవార్త... పంట బీమా బకాయిలు విడుదల చేసిన ఏపీ సర్కారు

AP government pays pending premium for the insurance of farmers
  • రూ.596 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • 2019-20 సంవత్సరానికి ఉచిత బీమా ఇస్తున్నట్టు ప్రకటించిన సీఎం
  • గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదని ఆరోపణ
ఏపీ సర్కారు రైతులకు ఊరట కలిగిస్తూ, పంటల బీమా బకాయిలు మొత్తం విడుదల చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి మొత్తం క్లెయిము రూ.596.36 కోట్లు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం వాటా రూ.122.16 కోట్లు. ఈ బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. 5.94 లక్షల మంది రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ, రైతులందరికీ ఉచిత బీమా అందజేస్తున్నామని, 2019-20 సంవత్సరానికి ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తామని వెల్లడించారు. చెల్లించాల్సిన ప్రీమియంలో రైతు వాటాను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. గతంలో 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన రూ.126 కోట్లను చెల్లించలేదని ఆరోపించారు. అటు రైతులు తమ వంతు ప్రీమియం చెల్లించారని, ఇటు కేంద్రం కూడా తన వంతు చెల్లించినా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా బీమా లబ్ది రైతులకు అందలేదని సీఎం జగన్ వివరించారు.

బీమా పథకంలో మొదట రైతు చెల్లించాక మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం  చెల్లించాలని తెలిపారు. అప్పుడే రైతుకు సకాలంలో బీమా మొత్తం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు నష్టపోకుండా ఉండేందుకు బీమా విధానంలో పూర్తిగా మార్పులు చేసి, రైతుకు ఉచిత బీమా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.
Insurance
Farmers
Andhra Pradesh
Jagan
YSRCP
Telugudesam

More Telugu News