Jagan: టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనలోని తేడాలను చూడండి: 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్

jagan launches new scheme in ap
  • అర్హులైన ప్రతి కాపు మహిళకు ఏటా రూ.15 వేల సాయం  
  • ప్రతి ఏడాది రూ.1,000 కోట్లు ఇస్తామని టీడీపీ చెప్పింది
  • ఏడాదికి సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది 
  • ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు ఇచ్చాం 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి సాయపడడమే లక్ష్యంగా 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ ల్యాప్ టాప్ బటన్ నొక్కి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... అర్హులైన కాపు మహిళలకు ప్రతి ఏడాది రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ప్రజలందరూ గత టీడీపీ, నేటి వైసీపీ ప్రభుత్వ పాలనలోని తేడాలను చూడాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసిందో చూడండంటూ పలు వివరాలు వెల్లడించారు.

ప్రతి ఏడాది కాపులకు రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏడాదికి సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చిందని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం మాత్రం పలు పథకాల ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్ల మొత్తాన్ని కాపు కులస్తులకు ఇచ్చిందని వివరించారు.
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనలతో  తాము ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగామని జగన్ చెప్పారు. ఇప్పటివరకు 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా సాయం చేశామని తెలిపారు. లబ్దిదారులకు బ్యాంక్‌ ఖాతాల్లో నగదును జమ చేశామమని తెలిపారు.

కులమత రాజకీయాలు చేయట్లేదని, ఏ పార్టీకి చెందిన వ్యక్తులని చూడకుండా అర్హులందరికీ లబ్ది చేకూర్చుతున్నామని జగన్ తెలిపారు. పథకాల లబ్ది అందని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దని, దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పథకాల అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో పేర్కొంటున్నారని, పేరు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Telugudesam

More Telugu News