KCR: సూర్యాపేటలో కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్
- హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేట చేరుకున్న సీఎం
- రూ.5 కోట్ల చెక్, ఇంటి స్థలం పత్రాలు, ఉద్యోగ నియామక పత్రం అందజేత
- సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేట వెళ్లిన ఆయన సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుత సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆపై రూ.5 కోట్ల ఆర్థిక సాయం తాలూకు చెక్, హైదరాబాద్, షేక్ పేటలో ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. అంతేకాదు, తమ ప్రభుత్వం ప్రకటించినట్టుగా సంతోష్ బాబు భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందజేశారు.
సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడి అమరుడైన సంగతి తెలిసిందే.
కాగా, సీఎం కేసీఆర్ తమ నివాసానికి రావడం పట్ల సంతోష్ బాబు తల్లి మంజుల, భార్య సంతోషి హర్షం వ్యక్తం చేశారు. తల్లి మంజుల మాట్లాడుతూ, కేసీఆర్ పరామర్శ తమలో ఎంతో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. ముందు ప్రకటించినట్టుగా తల్లిగా తనకు కోటి రూపాయలు ఇచ్చారని, తన కొడుకు పిల్లలకు రూ.4 కోట్లు ఇచ్చారని ఆమె వెల్లడించారు. తన కోడలికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారని వివరించారు. నీ కొడుకును తీసుకురాలేకపోయినా ఎప్పటికీ అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని, ఆయన చేతల మనిషి అని నిరూపించుకున్నారని కొనియాడారు.
సంతోష్ బాబు భార్య సంతోషి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తమకే కాకుండా, ఘర్షణలో మరణించిన జవాన్లు అందరికీ ఆర్థికసాయం ప్రకటించడం హర్షణీయం అని అన్నారు. తన పిల్లలతోనూ ఆయన కొంతసమయం గడిపారని, వారితో ముచ్చటించారని ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్ తన పిల్లలకు రూ.4 కోట్లు ఇచ్చారని, తన అత్తగారికి కోటి రూపాయలు ఇచ్చారని వివరించారు. అంతేకాకుండా, తనకు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు హైదరాబాద్ బంజారాహిల్స్ లో 711 గజాల ఇళ్ల స్థలం కూడా ఇచ్చారని తెలిపారు.