Remdesivir: కరోనా రోగులకు ఉపశమనం.. ఈ నెలాఖరు నాటికి మన మార్కెట్లోకి ‘రెమ్‌డెసివిర్’!

Remdesivir ready to enter Indian market
  • భారత ఫార్మా కంపెనీలతో గిలీడ్ సైన్సెస్ ఒప్పందం
  • భారత్ సహా 127 దేశాల మార్కెట్లోకి
  • డీసీజీఐ అనుమతి కోసం ఫార్మా కంపెనీల దరఖాస్తు
కరోనాతో అల్లాడిపోతున్న మన దేశానికి ఇది శుభవార్తే. కరోనా వైరస్‌తో బాధపడే రోగులకు కొంతవరకు ఉపయోగపడుతోందన్న పరిశోధనాత్మక యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోంది. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ఈ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ ఔషధానికి ఇంకా తుది అనుమతులు రానప్పటికీ దీనిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలతో గిలీడ్ సైన్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్ వంటివి ఉన్నాయి.

ఒప్పందం ప్రకారం ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసి భారత్‌తో పాటు 127 దేశాల్లో విక్రయించనున్నారు. దీంతోపాటు ఔషధ తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ కంపెనీలకు గిలీడ్ సైన్సెస్ నుంచి బదిలీ అవుతుంది. కాగా, గిలీడ్ సైన్సెస్‌తో ఒప్పందం కుదిరిన కంపెనీలు భారత్‌లోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అనుమతి లభించిన నాలుగైదు రోజుల్లోనే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.
Remdesivir
India
Corona Virus
gilead sciences

More Telugu News