India: ఇండియాలో ఫస్ట్ టైమ్... 12 వేలు దాటేసిన రోజువారీ కేసులు!

Daily corona Cases Crossed 12 Thousands in India
  • శనివారం నాడు 12,368 కేసులు
  • తాజాగా మరణించిన 310 మంది
  • 9,195కు చేరుకున్న మొత్తం మరణాలు

గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో కొత్తగా 12,368 కరోనా కేసులు వచ్చాయి. ఒక రోజు వ్యవధిలో ఇంత భారీగా కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు, ఇండియాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 9 వేలను దాటింది. గడచిన 8 రోజుల వ్యవధిలో ఆరు రోజుల పాటు కేసుల సంఖ్య విషయంలో రికార్డులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 3.21 లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం.

ఇక శనివారం నాడు 310 మంది కన్నుమూయగా, మొత్తం మరణాల సంఖ్య 9,195కు చేరింది. ప్రపంచంలో వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఇండియా ఇప్పుడు 9వ స్థానంలో ఉంది. మొత్తం కేసుల విషయంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత 10 రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మే ఆరంభంతో పోలిస్తే, నెలాఖరుకు మరణాల సంఖ్య రెట్టింపయింది.

ఇండియాలో తొలి కేసు మార్చి 12న నమోదుకాగా, ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు గత పది రోజుల్లోనే రావడం, మహమ్మారి వ్యాప్తి ఎంత వేగంగా కొనసాగుతోందో చెప్పకనే చెబుతోంది. శనివారం నాటి కేసుల్లో మహారాష్ట్రలో 3,427 కేసులు రాగా, ఢిల్లీలో 2,134 కేసులు, వచ్చాయి. కొత్త కేసుల విషయంలో తెలంగాణ (253), ఆంధ్రప్రదేశ్ (222), ఒడిశా (225), లడక్ (198), సిక్కిం (33) రాష్ట్రాలు రికార్డును సృష్టించాయి.

  • Loading...

More Telugu News