JC Diwakar Reddy: తప్పదనుకుంటే నేను, నా భార్య చెట్టుకిందైనా బతుకుతాం: జేసీ దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy comments on ongoing situations
  • జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై దివాకర్ రెడ్డి స్పందన
  • సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు
  • దేవుడికి భయపడడు కానీ మోదీకి భయపడతాడని వెల్లడి
లారీ ఛాసిస్ కొనుగోళ్ల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి, ఇతరులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై అనుమానాలు ఉంటే వారిని ఏ7, ఏ8 గానో చేర్చాలని అన్నారు. ఈ వ్యవహారంలో ఏ1 మరొకరు ఉన్నారని, అయితే అధికార పక్షానికి అశోక్ లేలాండ్ నుంచి ఏమి ఆమ్యామ్యా ముట్టిందో ఏమోనని వ్యాఖ్యానించారు.

తమ బస్సులపై అనేక కేసులు నమోదు చేశారని, డేంజర్ లైట్ లేదని, వైపర్ లేదని, సీటు శుభ్రంగా లేదని కేసులు నమోదు చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. "మా డ్రైవర్లు సీటు బెల్టు వేసుకోలేదని కూడా కేసు వేశారు. ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో డ్రైవరు సీటు బెల్టు వేసుకోవడం చూశారా? ఈ విషయంలో కోర్టుకు వెళితే, అధికారుల నుంచి నష్టపరిహారం కోరాలని న్యాయస్థానం సూచించిందని చెప్పారు. అయితే అధికారులపై మానవతా దృక్పథంతో మేము వారిపై చర్యలకు దిగలేదు" అని జేసీ వెల్లడించారు.

"మావాడు సాక్షి పేపర్ ఆఫీసు ఎదుట ఎప్పుడో ఓసారి ధర్నా చేశాడు. అప్పుడు ఏదో పదప్రయోగం చేశాడు. ఏదో ఊతపదం వాడాడేమో. దాన్ని పట్టుకుని రాయలసీమ బుద్ధి చూపించారు. ఆర్థికమూలాలు దెబ్బతీసి రోడ్డున పడేట్టు చేయడమే సీమ పద్ధతి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా గతంలోనూ లేడు, మున్ముందూ రాడు. ఆయన అల్లాకు, ఏసుకు, శ్రీశైలం మల్లన్నకు భయపడడు కానీ ఎక్కడో ఉన్న మోదీకి భయపడతాడు.

ఇక నావంతు వచ్చినా అరెస్ట్ కు భయపడేది లేదు. నాకుంది పది ఎకరాలు. నేను నా భార్య చెట్టుకిందైనా బతకగలం. నా పిల్లలు బాగా చదువుకున్నారు. ఎలాగో బతుకుతాం" అంటూ తనదైన శైలిలో బదులిచ్చారు. ఇక ఎవర్ని టచ్ చేసినా ఏం జరుగుతుందో తెలియదు కానీ, చంద్రబాబునాయుడ్ని టచ్ చేస్తే మాత్రం ఏపీలో తిరుగుబాటు రావడం ఖాయమని జేసీ హెచ్చరించారు.
JC Diwakar Reddy
JC Prabhakar Reddy
Arrest
Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News