Chandrababu: అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి అత్యంత బాధాకరం: చంద్రబాబు
- హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన చంద్రబాబు
- జీజీహెచ్ లో అచ్చెన్నను పరామర్శించేందుకు ప్రయత్నం
- అనుమతి నిరాకరించిన పోలీసులు
- దొంగదెబ్బ తీస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గుంటూరు జీజీహెచ్ కు వచ్చారు. అయితే ఆయనను ఆసుపత్రిలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. అచ్చెన్న కోసం హైదరాబాద్ నుంచి నేరుగా ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబు నిరాశకు గురయ్యారు. అయితే అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటిండెంట్ సుధాకర్ తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఈ పరిణామాలు ఎంతో బాధాకరం అనిపించిందని వెల్లడించారు.
పైల్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత రోజే 15 గంటలు ప్రయాణం చేయాల్సిరావడం దారుణమని, సాధారణంగా పైల్స్ ఆపరేషన్ తర్వాత వారం రోజుల విశ్రాంతి అవసరమని తెలిపారు. మందులు తీసుకుంటానని చెప్పినా అధికారులు అంగీకరించకపోవడం విచారకరమని అన్నారు. ప్రయాణంలో అచ్చెన్నకు రక్తస్రావం జరిగిందని, ఈ విషయం మీడియా వాళ్లు కూడా చూసుంటారని వివరించారు.
"డాక్టర్లను అడిగితే కొన్నిచోట్ల రక్తం గడ్డకట్టిందని, అది చీముగా మారే అవకాశముందని చెప్పారు. నిన్న జరిగిన పరిణామాలు అత్యంత బాధాకరం. 300 మంది పోలీసులను అచ్చెన్న కోసం మోహరించారు. ఓ టెర్రరిస్టుపై దాడి చేసినట్టుగా ఇంటి గోడలు దూకి మరీ వెళ్లారు. తనకు పైల్స్ ఆపరేషన్ జరిగిందని అచ్చెన్న నిజం చెబుతున్నా వినిపించుకోలేదు. ప్రయాణం చేయలేను, మందులు తీసుకోవాల్సి ఉంది అని చెబుతున్నా వినకుండా తీసుకువచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే మేజిస్ట్రేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.
అచ్చెన్నాయుడి కుటుంబంతో మాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. అచ్చెన్న, ఎర్రన్న పార్టీ కోసం ఎంతో శ్రమించారు. అంచెలంచెలుగా ఎదిగిన కుటుంబం అది. ఎంతో ప్రతిష్ఠ కలిగిన కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం ఇది. కావాలని అతడ్ని ఇరికించాలని తప్పుడు రికార్డులు సృష్టించి అరెస్ట్ చేశారు. అధికారం శాశ్వతం కాదు.
ఇప్పుడు మంత్రులు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు... ఇవాళ ఇతని వంతు, రేపు మరొకరి వంతు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న అచ్చెన్న, ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, రేపు మరొకరు అని బెదిరిస్తున్నారు. ప్రలోభాలతో మా పార్టీ నేతలను లొంగదీసుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నిస్తున్నవారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అన్ని అంశాల్లో వాస్తవాలు ప్రజల ముందు ఉంచుదాం. చర్చిద్దాం రండి ఎవరు దోషులో తేలుతుంది. అలా కాకుండా దొంగదెబ్బలు తీస్తున్నారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు.