Gel: మహిళలకు గుడ్ న్యూస్.. గర్భనిరోధానికి అందుబాటులోకి జెల్!
- జెల్‌కు అనుమతిచ్చిన అమెరికా ఎఫ్‌డీఏ
- ఆమ్ల స్థాయిని తగ్గించి వీర్యకణాలను నిర్వీర్యం చేసే జెల్
- కండోములు, ఇతర గర్భనిరోధ సాధనాలపై ఇష్టం లేని వారికి వరం
మహిళలకు శుభవార్తే. గర్భనిరోధానికి ఎలాంటి హార్మోన్లు లేని జెల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి కూడా లభించింది. లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, పొటాషియం బిటాట్రేట్‌ల మిశ్రమంతో తయారైన ఈ జెల్ జననాంగంలోని ఆమ్లస్థాయిని నియంత్రించడం ద్వారా గర్భం రాకుండా చేస్తుంది. స్త్రీపురుషుల కలయిక సమయంలో విడుదలయ్యే వీర్యం స్త్రీ జననాంగంలోని ఆమ్లస్థాయిని పెంచుతూ వీర్యకణాలు చురుగ్గా ఉండేందుకు అవసరమైన స్థితిని ఏర్పరుస్తుంది.
అయితే, ఈ గర్భనిరోధక జెల్ ఈ ప్రక్రియపై ప్రభావం చూపి పెరిగిన ఆమ్లస్థాయిని తగ్గించి వీర్యకణాలను నిర్వీర్యం చేస్తుంది. దుష్ప్రభావాలు లేని ఈ జెల్ 86 శాతం వరకు సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. కండోములు, ఇతర గర్భనిరోధక సాధనాలపై ఆసక్తి లేనివారికి ఈ జెల్ చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.