Hyderabad: ఆర్థికంగా ఎదుగుతున్న అన్న.. జీర్ణించుకోలేక చంపేసిన తమ్ముడు!

Younger Brother Murdered His Own Brother
  • ఇల్లుకట్టుకుని విడిగా ఉంటున్న అన్నపై అకారణ ద్వేషం
  • అన్న మద్యం మత్తులో ఉండగా ఉరేసి చంపేసిన తమ్ముడు
  • హైదరాబాద్‌లోని సూరారంలో ఘటన
అన్న ఆర్థికంగా ఎదుగుతుంటే చూడలేకపోయాడు. అతడిని ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఉరివేసి చంపేశాడు. ఆపై దానిని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నంలో దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్‌లోని సూరారంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే షాజదాబేగానికి మొదటి భర్త ద్వారా సాబేర్ (29) జన్మించగా, రెండో భర్త కుమారుడు అజం. సాబేర్ ఆర్థికంగా స్థిరపడ్డాడు. సొంతంగా ట్యాంకర్ నడుపుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. సొంతంగా ఇల్లు కట్టుకుని భార్య, కుమారుడితో విడిగా ఉంటున్నాడు.

ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్న అజం.. అన్న ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోయాడు. అతడిని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అతడికి సమయం కలిసొచ్చింది. భార్య, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లడంతో సాబేర్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన సాబేర్.. తమ్ముడికి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రోజు అర్ధరాత్రి వరకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని అజం.. బెడ్‌షీట్‌తో అన్న మెడకు ఉరి బిగించి చంపేశాడు.

అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు. తిరిగి ఆదివారం సాయంత్రం వచ్చిన అజం.. అతిగా మద్యం తాగడం వల్ల కానీ, గుండెపోటు వల్ల కానీ సాబేర్ మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతడిని అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Suraram
Murder
Crime News

More Telugu News