High Court: మృతదేహాలకు కరోనా పరీక్షల అంశంలో మా ఆదేశాలను పట్టించుకోరా?: తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

High Court questions Telangana government on corona tests
  • తమ ఆదేశాలు అమలు కావట్లేదంటూ హైకోర్టు ఆగ్రహం
  • హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించామన్న అడ్వొకేట్ జనరల్
  • ఈ నెల 17 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు తాజా ఆదేశాలు
కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాలని తాము గతంలో ఆదేశించామని, తమ ఆదేశాలను ఎందుకు పాటించడంలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే అందుకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

దీనిపై అడ్వొకేట్ జనరల్ బదులిస్తూ... గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించామని, ఇంకా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. దాంతో సంతృప్తి చెందని హైకోర్టు ఈ నెల 17 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీం విచారణ షురూ అయ్యేవరకు తమ ఆదేశాలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

అంతేకాదు, ప్రజల్లో ర్యాండమ్ టెస్టులు ఎందుకు నిర్వహించడంలేదని సర్కారును అడిగింది. మీడియాకు విడుదల చేసే కరోనా వివరాల బులెటిన్లలో తప్పుడు లెక్కలు చూపిస్తే కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిజాలు వెల్లడించినప్పుడే ప్రజలకు కరోనా తీవ్రత గురించి తెలుస్తుందని హితవు పలికింది.
High Court
Telangana
Corona Virus
Tests
COVID-19

More Telugu News