Kerala: ఏనుగు తిన్నది పైనాపిల్ కాదట... విచారణలో పలు విషయాలను వెల్లడించిన నిందితుడు!

Police says cracker stuffed coconut used to kill elephant
  • కొబ్బరికాయలో పేలుడు పదార్థాలు నింపి ఏనుగుకు తినిపించిన దుండగులు
  • నరకయాతన అనుభవించి చనిపోయిన ఏనుగు
  • దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు
గర్భంతో ఉన్న ఓ ఏనుగు చనిపోయిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. టిక్ టాక్ కోసం కొందరు దుండగులు పైనాపిల్ లో పేలుడు పదార్థాలను ఉంచి ఏనుగుకు తినిపించారు. దాన్ని ఏనుగు కొరకడంతో నోట్లో పేలుడు సంభవించింది. అనంతరం అది తీవ్రమైన నొప్పిని భరిస్తూ, ఆహారాన్ని తీసుకోలేక మరణించింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ దారుణానికి పాల్పడినట్టుగా భావిస్తున్న వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు.

మరోవైపు ఈ ఘటన మరో మలుపు తిరిగింది. అందరూ భావిస్తున్నట్టు ఏనుగు తిన్నది పైనాపిల్ కాదని... కొబ్బరికాయ అని పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలు నింపిన కొబ్బరికాయను తినడంతో పేలుడు సంభవించిందని చెప్పారు. గాయపడిన తర్వాత ఆహారం, నీరు తీసుకోలేని పరిస్థితుల్లో వెల్లియార్ నదిలో ప్రాణాలు విడిచిందని తెలిపారు. పట్టుబడిన నిందితుడిని విచారించడంతో... అతను ఈ వివరాలను వెల్లడించాడు.

ఈ కేసులో అరెస్టైన విల్సన్ అనే వ్యక్తి రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పేలుడు పదార్థాలు తయారు చేసిన ప్రాంతానికి కూడా నిందితుడిని తీసుకెళ్లామని చెప్పారు. అక్కడున్న ఓ షెడ్ లో మరో ఇద్దరితో కలిసి పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలోనే ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.
Kerala
Elephant
Death

More Telugu News