చిన్నారి ఆకలి తీర్చేందుకు చిరుతలా రైలు వెంట పరిగెత్తిన పోలీసు!

Railway police ran very speedily to help a mother
  • భోపాల్ రైల్వే స్టేషన్ లో ఘటన
  • బిడ్డకు పాలు కావాలని రైల్వే పోలీసును కోరిన ప్రయాణికురాలు
  • రైలు కదలడంతో వేగంగా పరుగెత్తి మహిళకు పాలు అందించిన పోలీసు
  • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వైనం
తన బిడ్డ ఆకలి తీర్చాలన్న తల్లి తాపత్రయం ఆ రైల్వే పోలీసును చిరుతలా ముందుకు ఉరికించింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళుతున్న ఓ రైలు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఆగింది. ఆ రైలులో నాలుగు నెలల చిన్నారితో పాటు ఓ మహిళ ప్రయాణిస్తోంది. తన వద్ద ఉన్న పాలు అయిపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ ను సాయం కోరింది. అయితే ఇందర్ యాదవ్ పాల ప్యాకెట్ తెచ్చేలోపే రైలు కదిలింది. అయితే, ఆ చిన్నారి ఆకలి, తల్లి వేదన గుర్తు తెచ్చుకున్న ఇందర్ యాదవ్ రైలు వెంబడి చిరుతలా పరుగెత్తాడు.

భుజానికి బరువైన రైఫిల్ వేళ్లాడుతున్నా వెనుదీయకుండా, తన శక్తిమేర ఓ మహిళ ఉన్న బోగీ వెంట పరుగులు తీశాడు. చివరికి పాలను ఆ తల్లికి అందించి తన పరుగును ఆపాడు. స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.

కాగా, తన స్వస్థలం చేరుకున్న ఆ మహిళ రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఒక హీరోలాగా తన బిడ్డ ఆకలి తీర్చాడని, పాలు లేకపోవడంతో బిడ్డకు నీళ్లలో ముంచిన బిస్కెట్లు తినిపించాల్సిన అగత్యం నుంచి తప్పించారని కొనియాడింది. ఈ ఘటన రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లడంతో, రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ ను అభినందించారు. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

Go Back to Shorts
Inder Yadav
Indian Railways
Police
Mother
Help
Bhopal

More Telugu News