Malls: డిస్కౌంట్లు ఇస్తే జనాలు పెరిగిపోతారట... మాల్స్ అభిప్రాయం!

Malls may keep discounts away after Re open
  • వచ్చే వారంలో తెరచుకోనున్న మాల్స్
  • కొంతకాలం పాటు డిస్కౌంట్లకు దూరంగా అపెరల్ కంపెనీలు
  • జూలై తరువాత మాత్రమే ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్
రెండు నెలలకు పైగా సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం వచ్చే వారంలో మాల్స్ తిరిగి తెరచుకోనుండగా, ఆఫర్లు, డిస్కౌంట్లకు కొంత కాలం దూరంగా ఉండాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. సాధారణంగా లైఫ్ స్టయిల్ రీటెయిల్ సంస్థలు ఎన్నో ఆఫర్లను కస్టమర్లకు అందిస్తుంటాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి భయం నెలకొనివున్న వేళ, డిస్కౌంట్లను ప్రకటిస్తే, అధిక సంఖ్యలో ప్రజలు మాల్స్ కు వస్తారని, దీంతో భౌతిక దూరం నిబంధన పాటించడం కష్టమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

"కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే మాల్స్ కు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ విపత్కర సమయంలో డిస్కౌంట్లు ఇస్తే, మాల్స్ కు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితి రానివ్వరాదని ఆలోచిస్తున్నాం" అని టామీ హిల్ ఫిగర్, ఏరో తదితర ఎన్నో బ్రాండ్లను మేనేజ్ చేస్తున్న అరవింద్ ఫ్యాషన్స్ సీఈఓ జే సురేశ్ అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మాల్స్ ప్రారంభం కానుండగా, న్యూఢిల్లీ, ముంబై, గురుగ్రామ్ వంటి కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం అవి తెరిచేందుకు ఇంకా అనుమతులు లభించలేదు. వాస్తవానికి జూన్ రెండో వారం నుంచి మాల్స్ లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్ ప్రారంభం అవుతాయి. ఇక తమ వద్ద ఉన్న స్టాక్స్ ను వదిలించుకునేందుకు అపెరల్ కంపెనీలు ఆన్ లైన్ లో డిస్కౌంట్లను ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నాయి.

కాగా, కొన్ని బ్రాండ్లు మాత్రం, మాల్స్ తెరచిన కొన్ని రోజుల తరువాత డిస్కౌంట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జూలై తొలివారంలో తాము ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్ ప్రారంభిస్తామని ప్యూమా ఇండియా హెడ్ అభిషేక్ గంగూలీ వెల్లడించారు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో, కస్టమర్ల రక్షణకు పెద్ద పీట వేయాలని నిర్ణయించామని ఆయన అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, షాపుల్లో ఒకేసారి ఐదుగురికన్నా అధిక కస్టమర్లు ఉండరాదన్న సంగతి తెలిసిందే. వీరి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి. "కస్టమర్లను డిస్కౌంట్లతో ఆకర్షించడం కన్నా, వారి భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఇది" అని ఫ్యూచర్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ బియానీ అభిప్రాయపడ్డారు.
Malls
ReOpen
discounts
Social Distancing

More Telugu News