Bike: చోరీకి గురైన బైక్ కొరియర్ లో రావడంతో యజమాని ఆనందం!

Stolen bike delivered by courier service in Tamilnadu
  • తమిళనాడులో ఘటన
  • షాపు ముందు పార్క్ చేసిన బైక్ మాయం
  • పోలీసు కేసుకు భయపడిన చోరీ చేసిన వ్యక్తి
  • రిజిస్ట్రేషన్ పేపర్ లో అడ్రస్ చూసి బైక్ సొంతదారుకు పార్శిల్
తమిళనాడులో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. బైక్ దొంగతనం చేసిన వ్యక్తి పోలీసు కేసుకు భయపడి ఆ బైక్ ను కొరియర్ సర్వీసు ద్వారా తిరిగి యజమానికి పార్శిల్ చేశాడు. పోయిందనుకున్న బండి తిరిగొచ్చేసరికి ఆ యజమాని ఆనందం అంతాఇంతా కాదు. కోయంబత్తూరుకు చెందిన సురేశ్ కుమార్ అనే వ్యక్తి మే 18న తన లేత్ వర్క్ షాపు ముందు బండి పార్క్ చేశాడు. అయితే మధ్యాహ్నం చూసేసరికి పార్క్ చేసిన బైక్ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు కానీ, కరోనా విధుల కారణంగా దర్యాప్తు చేయలేకపోయారు.

దాంతో, సురేశ్ కుమార్ అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజి పరిశీలించి చూడగా, ఓ యువకుడు బైక్ తీసుకెళ్లినట్టు గుర్తించాడు. దాంతో ఆ యువకుడి విజువల్స్ ను వాట్సాప్ లో ప్రచారం చేశాడు. దాంతో కొందరు అతడి పేరు ప్రశాంత్ అని, ఓ బేకరీలో పనిచేస్తుంటాడని చెప్పారు. అతనుంటున్న ఇంటికి వెళితే, తన సొంతూరికి వెళ్లాడని తెలిసింది.

అయితే, తిరువారూర్ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిన ప్రశాంత్ కు బైక్ ఓనర్ తనకోసం గాలిస్తున్నట్టు తెలిసి, పోలీసు కేసు పట్ల భయపడ్డాడు. దాంతో, బైక్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్ లోని అడ్రస్ ప్రకారం బండిని కొరియర్ ద్వారా పార్శిల్ చేశాడు. ఓ రోజు కొరియర్ ఆఫీసు నుంచి మీ బైక్ తీసుకెళ్లండంటూ ఫోన్ రావడంతో సురేశ్ ఆశ్చర్యపోయాడు. డెలివరీ తీసుకున్న తర్వాత అది తన బైకేనని గుర్తించి ఆనందం వ్యక్తం చేశాడు. రెండు వారాల తర్వాతైనా తన బైక్ వచ్చింది కాబట్టి ఇక పోలీసు కేసుతో పనిలేదని చెప్పాడు.
Bike
Theft
Courier
Parcel
Coimbatore
Tamilnadu

More Telugu News