Roja: ఆయన ఫొటోకు దండేసి.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనడం సిగ్గుచేటు!: చంద్రబాబుపై రోజా మండిపాటు

Roja Fires on Chandrababu
  • మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది?
  • వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు
  • నేడు ఆ విషయాలన్నీ మరచిపోయారా?
  • చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారన్న రోజా
మహానాడులో మహానేత ఎన్టీఆర్ చిత్రపటానికి దండేసిన చంద్రబాబు, ఆ వెంటనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురిని మంత్రులుగా చేసిన వేళ, ప్రజాస్వామ్యం ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు, నేడు దాన్ని మరచిపోయారా? అంటూ నిప్పులు చెరిగారు.

విజయవాడలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళలు, రైతులకు సీఎం జగన్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని, అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే రూ. 10 వేల కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేశారని గుర్తు చేశారు. పలు సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఆమె వెల్లడించారు. తాను 33 పథకాలు ప్రవేశ పెట్టానని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని, కనీసం ఒక్కో పథకానికి ఒక్కో సీటునైనా ఇవ్వకుండా ప్రజలు ఛీ కొట్టిన విషయాన్ని మరిచారా? అని అడిగారు.

ప్రజలు తిరస్కరించినా, చంద్రబాబుకు బుద్ధి రాలేదని, తన మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తూ జగన్ ముందుకు సాగుతుంటే, టీడీపీ మాత్రం వారి వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను తీసేసిందని సెటైర్లు వేశారు.
Roja
Chandrababu

More Telugu News