టిక్‌టాక్ కోసం శునకాన్ని హింసించి చంపిన యువకులు.. అరెస్టు!
- కుక్క కాళ్లను తాళ్లతో కట్టి మురికిగుంటలోకి విసిరివేత
- ఆపై రాళ్లతో కొట్టి హత్య
- ఉజ్జయినిలో పట్టుబడిన నిందితులు
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇద్దరు యువకులు ఓ శునకం కాళ్లను తాడుతో కట్టి దానిని ఇద్దరూ పట్టుకుని పెద్ద మురికిగుంటలోకి విసిరేస్తూ వీడియో తీశారు. అంతేకాదు, అది బయటకు తేలకుండా ఒడ్డు నుంచి పెద్ద రాళ్లతో దానిని కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో దుమారం రేగింది.
శునకాన్ని హింసించి చంపిన వారిని పట్టుకుని శిక్షించాలంటూ నెట్టింట డిమాండ్లు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు సునీల్ శెట్టి, హీనా సిద్ధు వంటి వారు కూడా ఈ వీడియోపై స్పందించారు. ఈ వీడియోను చూసిన ‘పెటా’ తీవ్రంగా స్పందించింది. శునకాన్ని హింసించిన వారిని పట్టుకుని అప్పగిస్తే రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించింది.
మరోవైపు, పోలీసులు కూడా నిందితుల కోసం వేట ప్రారంభించారు. చివరికి ఉజ్జయినిలో వీరు పోలీసులకు చిక్కారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.