Sonia Gandhi: మోదీ ప్యాకేజీ ఒక పెద్ద జోక్: విపక్షాల సమావేశంలో సోనియాగాంధీ విమర్శలు

Modis package is joke says Sonia Gandhi
  • పేదల పట్ల కేంద్రానికి సానుభూతి లేదు
  • లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి క్లారిటీ లేదు
  • 13 కోట్ల కుటుంబాలను పట్టించుకోవడం లేదు
విపక్ష పార్టీల కూటమి సమావేశంలో ప్రధాని మోదీపైనా, ఎన్డీయే ప్రభుత్వంపైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. పేద ప్రజల పట్ల కేంద్రానికి ఎలాంటి సానుభూతి లేదని అన్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం దారుణమైన చర్యలకు పాల్పడుతోందని... ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్మేస్తోందని మండిపడ్డారు.

ప్రస్తుతం అధికారమంతా ప్రధాని కార్యాలయానికే పరిమితం అయిందని సోనియా అన్నారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాఖ్య వ్యవస్థను కేంద్రం పక్కన పెట్టేసిందని విమర్శించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే హాజరుకాగా... అఖిలేశ్ యాదవ్, మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారు. కాంగ్రెస్ తో వీరికి ఉన్న రాజకీయ ఇబ్బందులే దీనికి కారణం.

తొలుత లాక్ డౌన్ 21 రోజులే అనుకున్నారని... ఇప్పుడు ఎన్ని రోజులు కొనసాగిస్తారో కూడా అర్థం కావడం లేదని సోనియా అన్నారు. ఈ విషయంలో కేంద్రానికి ఒక క్లారిటీ లేదని విమర్శించారు. వ్యాక్సీన్ కనిపెట్టేంత వరకు కరోనా వైరస్ ఉంటుందనేది వాస్తవమని... లాక్ డౌన్ కొనసాగిస్తే, కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీ... ఆ తర్వాత ఐదు రోజు పాటు ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ దాన్ని వివరించిన విధానం అంతా పెద్ద జోక్ గా ఉందని ఎద్దేవా చేశారు. వలస కార్మికులను అసలు పట్టించుకోలేదని విమర్శించారు. అట్టడుగున ఉన్న 13 కోట్ల కుటుంబాలకు చెందిన వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, ఉద్యోగాలు కోల్పోయిన వారు, స్వయం ఉపాధి ఉన్నవారు, దుకాణదారులను పరిగణనలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు. సమస్యలకు కేంద్ర ప్రభుత్వం వద్ద పరిష్కార మార్గాలు లేవనే విషయం అర్థమవుతోందని... ఇది కలవరపరిచే అంశమని చెప్పారు.
Sonia Gandhi
Narendra Modi
Package
Congress
BJP

More Telugu News