Vangalapudi Anita: డాక్టర్ సుధాకర్ బంధువులతో వైసీపీ నేతలు ఉదయం నుంచి బేరసారాలు సాగిస్తున్నారు: వంగలపూడి అనిత

Vangalapudi Anitha fires on YSRCP leaders over Doctor Sudhakar issue
  • సుధాకర్ బంధువులను వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు 
  • కాలితో తన్నించుకునే తప్పు డాక్టర్ సుధాకర్ చేశారా? అంటూ ఆగ్రహం
  • కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారంటూ వ్యాఖ్యలు
ఏపీలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఇప్పటికీ కాక రేపుతూనే ఉంది. ఇటీవలే సస్పెన్షన్ కు గురైన డాక్టర్ సుధాకర్ కొన్నిరోజుల క్రితం విశాఖ రోడ్లపై అనూహ్యరీతిలో కలకలం రేపారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి మానసిక వైద్యశాలకు తరలించారు.

దీనిపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత స్పందించారు. ఒక దళితుడిని నడిరోడ్డుపై పశువును కొట్టినట్టు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ పై కక్ష తీర్చుకున్నారని అనిత మండిపడ్డారు. మాస్కులు, పీపీఈ కిట్లు అడిగితే డాక్టర్ సుధాకర్ కు పట్టిన గతే తమకు కూడా పడుతుందని వైద్యులు భయపడుతున్నారని తెలిపారు.

ఇప్పుడు, డాక్టర్ సుధాకర్ బంధువులను వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారని, ఉదయం నుంచి బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. అయినా, కాలితో తన్నించుకునేంత తప్పు డాక్టర్ సుధాకర్   చేశారా? అని నిలదీశారు. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసినప్పుడు దళిత మంత్రులు, హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దమ్ముంటే దళిత మంత్రులు జగన్ ను నిలదీయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆఖరికి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక వ్యాధుల చికిత్సాలయంలో కూడా డాక్టర్ సుధాకర్ ను సుఖంగా ఉండనివ్వడంలేదని అన్నారు.
Vangalapudi Anita
Dr Sudhakar
Vizag
Police
YSRCP
Andhra Pradesh
Jagan

More Telugu News