Donald Trump: హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ రోజుకొకటి వేసుకుంటున్నా: ట్రంప్

Trump says Taking Hydroxychloroquine tablet every day
  • మరోమారు అందరినీ ఆశ్చర్యపరిచిన ట్రంప్
  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల వల్ల ఉపయోగం లేదని ఇప్పటికే తేల్చిన అధ్యయనాలు
  • కరోనా రోగులకు ఇస్తే గుండె సంబంధిత సమస్యలు
కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా తాను ప్రతి రోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కరోనాకు విరుగుడంటూ అప్పట్లో ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఈ ట్యాబ్లెట్లను దిగుమతి చేసుకున్నారు కూడా.

 అయితే, ఈ మందుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆ తర్వాత జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మందుల ఉపయోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు కూడా జారీ చేసింది. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.

అయినప్పటికీ తాను ఈ మాత్రలను గత వారం రోజులుగా రోజుకొకటి చొప్పున వేసుకుంటున్నట్టు ట్రంప్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు కరోనా పరీక్షలు చేసిన వైట్ హౌస్ వైద్యుడిని హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల ఉపయోగం గురించి అడిగితే ‘‘మీకు నచ్చితే మంచిది’ అని సమాధానం ఇచ్చారని, అందుకే వాటిని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు పనితనం గురించి తనకు చాలా మంది చెప్పారనీ, మంచి ఫలితాలు వచ్చినట్టు కూడా చెప్పారనీ, అందుకే ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. అలాగే జింక్ ట్యాబ్లెట్, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ కూడా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఉపయోగించవద్దని రట్టర్స్ విశ్వవిద్యాలయం మెడిసిన్ ప్రొఫెసర్ బాబ్ లాహిత హెచ్చరించడం గమనార్హం.
Donald Trump
Hydroxychloroquine
Corona Virus

More Telugu News