Road Accident: లాక్ డౌన్ తో రోడ్లు ఖాళీగా ఉన్నా... 2 వేలకు పైగా ప్రమాదాలు!

Above 2000 Road Accidents in Lockdown Period
  • రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 368 మంది
  • ఒక్క యూపీలోనే 139 మంది మరణం
  • అతి వేగం, నిర్లక్ష్యమే కారణమన్న సేవ్ లైఫ్ ఫౌండేషన్
దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్ డౌన్ అమలులోకి రాగా, వీధులు, రహదారులు అన్నీ ఖాళీ అయ్యాయి. రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిన సమయంలోనూ నిర్లక్ష్యం వందలాది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా మే 16 వరకూ 2 వేలకు పైగా ప్రమాదాలు జరిగాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్న సేవ్ ‌లైఫ్‌ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో 368 మంది వరకూ మరణించారని చెబుతూ గణాంకాలను వెలువరించింది.

మృతుల్లో స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులు 139 మంది వరకూ ఉన్నారని, అత్యవసర సేవల నిమిత్తం వెళుతున్న వారు 27 మంది ఉండగా, ఇతరులు 202 మంది ప్రాణాలను కోల్పోయారని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్ లో మృతుల సంఖ్య అధికంగా ఉందని, రాష్ట్ర పరిధిలో దాదాపు 100 మంది మరణించారని గణాంకాలు విడుదల చేసింది.

యూపీ తరువాత మధ్య ప్రదేశ్ లో 30 మంది, తెలంగాణలో 22 మంది, మహారాష్ట్రలో 19 మంది, పంజాబ్ లో 17 మంది ఉన్నారని, అత్యధిక ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సీఈవో పీయూష్‌ తివారీ వ్యాఖ్యానించారు. చాలా ప్రమాదాలు రాత్రి వేళల్లోనే జరిగాయని, త్వరగా గమ్యానికి చేరాలన్న ఆతృతతో వాహనాలను వేగంగా నడుపుతూ ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మరికొన్ని సందర్భాల్లో నిద్రిస్తున్న వారు తమ ప్రమేయం లేకుండానే ప్రమాదాలకు గురి కావడం దిగ్భ్రాంతి కలిగించే అంశమని తెలిపారు. కాగా, ఇండియాలో ఏటా 5 లక్షలకు పైగా రహదారి ప్రమాదాలు జరుగుతూ ఉండగా, సుమారు లక్షన్నర మంది మరణిస్తున్నారని అంచనా.
Road Accident
Lockdown
Savelife Foundation

More Telugu News