Russia: దేశంలోని సగానికిపైగా మరణాలకు కరోనా కారణం కాదు: రష్యా

60 percent of deaths in Russia due to Heart attack
  • కరోనా కేసుల్లో మూడో స్థానానికి రష్యా
  • మరణాలను దాచిపెడుతోందన్న విమర్శలు
  • గుండెపోటు, లుకేమియా కారణంగా 60 శాతం మరణాలు
రష్యాలో సంభవిస్తున్న మరణాలన్నింటికీ కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 60 శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులే కారణమని పేర్కొంది. కరోనా కోరల్లో చిక్కుకున్న రష్యాలో ఇప్పుడు కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు తొలి పది స్థానాల్లో కనిపించని రష్యా ఇప్పుడు ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,62,843 కేసులు నమోదు కాగా, 2,418 మంది మరణించారు. 58,226 మంది కోలుకోగా, 2,02,199 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

కేసులు సంఖ్య శరవేగంగా పెరుగుతున్నప్పటికీ మరణాలు మాత్రం అతి తక్కువగా నమోదవుతుండడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కావాలనే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆరోగ్యశాఖ ఏప్రిల్‌లో కరోనా కారణంగా 639 మంది మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 60 శాతం మరణాలకు కరోనా కారణం కాదని పేర్కొంది. వీటికి గుండెపోటు, లుకేమియా వంటి వ్యాధులే కారణమని వివరించింది.
Russia
Corona Virus
Corona deaths

More Telugu News