Corona Virus: ‘కరోనా’ తీవ్రత మగవారిలోనే ఎందుకు ఎక్కువో వెల్లడించిన తాజా అధ్యయనం!

Netherlands University study on corona virus
  • నెదర్లాండ్స్ కు చెందిన యూఎంసీ అధ్యయనం
  • మహిళల్లో, పురుషుల్లో ఉండే ఎంజైమ్ ఏసీఈ 2
  • ఈ ఎంజైమ్ సాయంతో కణాల్లోకి ప్రవేశిస్తున్న ‘కరోనా’
  • పురుషుల్లోనే ఏసీఈ 2 అధికం.. అందుకే, మగవారిలో ‘కరోనా’ తీవ్రత 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా పరిశోధనలు, అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

ఈ క్రమంలో ‘కరోనా’ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ అనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ, అందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు చూపించలేకపోయాయి. నెదర్లాండ్స్ కు చెందిన యూనివర్శిటీ మెడికల్ సెంటర్ (యూఎంసీ) నిర్వహించిన తాజా అధ్యయనం ద్వారా శాస్త్రీయ ఆధారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రియాన్ వూర్స్ ఆ వివరాలను వెల్లడించారు.

మహిళల్లో, పురుషుల్లో యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ఏసీఈ 2) అనే ఎంజైమ్ సాయంతో కొవిడ్-19 కారక ‘సార్స్ -కొవ్ 2’ వైరస్ కణాల్లోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. అయితే, ఈ ఎంజైమ్ మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉండటంతో ‘కరోనా’ ప్రభావం పురుషుల్లోనే అధికంగా ఉన్నట్టు విశ్లేషించారు.

ఏసీఈ2 ఎంజైమ్ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలలో కంటే వృషణాల్లో అధికంగా ఉంటుందని, అందుకే, మగవారిలో ‘కరోనా’ తీవ్రత అధికంగా ఉంటోందని వూర్స్ తెలిపారు. ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే దోహదపడుతోందని, అందుకే, ‘కరోనా’ బారినపడ్డ వారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ అంశంపై ఇంకా లోతైన పరిశోధన జరిపి ధ్రువీకరించాల్సి ఉందని అన్నారు.

‘కరోనా’ వెలుగులోకి రావడానికి ముందే తమ అధ్యయనాన్ని ప్రారంభించామని, గుండె సంబంధిత సమస్యలను అధ్యయనం చేస్తున్న సమయంలో ఏసీఈ2 పురుషుల్లో అధికంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. ‘కరోనా’ బారినపడి మరణిస్తున్న వారిలో అధికశాతం పురుషులే ఉండటంతో ఈ కోణంలోనూ అధ్యయనం చేయడంతో ఏసీఈ2 వల్లేనని గుర్తించామని అన్నారు. ఇదే విషయమై పరిశోధన జరిపిన మరో అధ్యయనంతోనూ తమ అధ్యయనం ఫలితాలు సరిపోలినట్టు చెప్పారు.

కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటీస్, మూత్రపిండాల సంబంధిత వ్యాధులలో ఏసీఈ సాంద్రతను నియంత్రించడానికి వాడే ఏసీఈ ఇన్ హిబిట్స్ లేదా యాంజియో టెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ (ఏఆర్ బీ)ను ‘కొవిడ్-19’ రోగులకు ఇవ్వొచ్చని, తద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని తమ అధ్యయనం ద్వారా వూర్స్ సూచించారు.
Corona Virus
Netherlands
University Medical Center

More Telugu News