Infosys: లాక్ డౌన్ పొడిగింపుపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆందోళన!

Infosys Narayana Murthy Warning on Lockdown Extension
  • కరోనాతో కాదు... ఆకలితో చావులు పెరిగిపోతాయి
  • లక్షల మంది ఉపాధిని కోల్పోనున్నారు
  • భారత్ వంటి దేశాల్లో లాక్ డౌన్ సరికాదు
  • కేంద్రానికి ఆదాయం కూడా తగ్గిపోతుంది
  • హెచ్చరించిన ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించడంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పొడిగింపు కారణంగా కరోనా కన్నా, ఆకలితో ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని ఆయన అంచనా వేశారు. లాక్ డౌన్ తో అసంఘటిత రంగంలోని  లక్షలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోనున్నారని అంచనా వేసిన ఆయన, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉన్నా, లాక్ ‌డౌన్ ను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని హెచ్చరించారు.

కరోనా వైరస్ విస్తరణ, వివిధ రకాల వ్యాపారాలపై లాక్‌ డౌన్ చూపించే‌ ప్రభావం గురించి తాజాగా విశ్లేషించిన నారాయణమూర్తి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పకుండా ఉండాలంటే, వ్యాధి సోకిన వారికి చికిత్సను అందిస్తూనే, సామర్థ్యం ఉన్నవారు, తిరిగి పని చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని, అలా జరుగకుంటే, ఆకలి మరణాలు కరోనా వైరస్ కారణంగా నమోదయ్యే మరణాలను మించిపోతాయని పేర్కొన్నారు. .

చాలా కంపెనీలు తమ ఆదాయంలో 15 నుంచి 20 శాతం కోల్పోయానని, ఇది ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యపై పడి తీరుతుందని మూర్తి అంచనా వేశారు. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ వసూలు కూడా తగ్గనుందని, ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లాక్ ‌డౌన్ ‌ను కొనసాగించే పరిస్థితుల్లో లేవని అన్నారు. ఇండియాలోని అసంఘటిత రంగంలో మరియు స్వయం ఉపాధి రంగాల్లో 20 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారని, లాక్ ‌డౌన్ పొడిగింపుతో వీరంతా సంక్షోభంలోకి కూరుకుపోనున్నారని అభిప్రాయపడ్డారు.

వివిధ రకాల కారణాలతో దేశంలో ప్రతి యేటా 90 లక్షల మరణాలు సంభవిస్తుంటాయని, వీటిల్లో 25 శాతం మరణాలు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న ఈ తరుణంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మరణాల రేటుతో పోలిస్తే, దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, మరణాల రేటు 0.25 నుంచి 0.5 శాతం మధ్య ఉండటం, రెండు నెలల్లో  వెయ్యి కరోనా మరణాలు సంభవించడం అంత భయాందోళన చెందాల్సిన పరిస్థితేమీ కాదని నారాయణమూర్తి అన్నారు. కరోనాను అరికట్టేందుకు నూతన మార్గాలను అన్వేషించడంతో పాటు కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని వ్యాపార వర్గాలకు ఆయన సూచించారు.
Infosys
Narayana Murthy
Lockdown
Extenssion

More Telugu News