Sachin Tendulkar: సచిన్ తో మాట్లాడితే రోజంతా బాధపడాల్సి ఉంటుంది... నాడు తమ బౌలర్లను హెచ్చరించిన మెక్ గ్రాత్

  • మెక్ గ్రాత్ చెప్పిన విషయాన్ని వెల్లడించిన బ్రెట్ లీ
  • సచిన్ ను స్లెడ్జింగ్ చేయవద్దని మెక్ గ్రాత్ చెప్పాడన్న స్పీడ్ స్టర్
  • ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన పాక్ మాజీ స్పిన్నర్ సక్లాయిన్
Brett Lee reveals what McGrath said in team meeting

క్రికెట్ ఆడే దేశాలన్నింటిలో ఆస్ట్రేలియా ఎంతో ప్రత్యేకం. ఆసీస్ క్రికెటర్లు ఆటతీరుతోనే కాదు మాటతీరుతోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. స్లెడ్జింగ్ కు మారుపేరులా నిలిచే కంగారూ ఆటగాళ్లు ఓ క్రికెటర్ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారట. ఆ క్రికెటర్ ఎవరో కాదు... భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఈ విషయాన్ని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్వయంగా వెల్లడించాడు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో సీనియర్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ జట్టులోని ఇతర ఫాస్ట్ బౌలర్లకు మార్గదర్శిగా వ్యవహరించేవాడని, కెరీర్ మొదట్లో అతడు తమతో చెప్పిన విషయం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు.

"ప్రతి మ్యాచ్ కు ముందు జట్టు సమావేశమయ్యేది. ఈ సమావేశంలో మెక్ గ్రాత్ మాట్లాడుతూ సచిన్ తో జాగ్రత్త అని చెప్పాడు. స్లెడ్జింగ్ చేసే క్రమంలో సచిన్ తో మాట్లాడారంటే ఆ రోజంతా బాధపడాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. ఎవరితో మాట్లాడినా సచిన్ తో మాట్లాడొద్దు అని స్పష్టం చేశాడు" అంటూ బ్రెట్ లీ వివరించాడు.

ఇటీవలే పాక్ ఆఫ్ స్పిన్ దిగ్గజం సక్లాయిన్ ముస్తాక్ కూడా ఇదే తరహా అభిప్రాయం వెలిబుచ్చాడు. సచిన్ ను ఓసారి స్లెడ్జింగ్ చేసిన విషయం చెబుతూ, "అప్పట్లో నేను కెరీర్ పరంగా ఎదుగుతున్న రోజులవి. కెనడా వేదికగా భారత్, పాక్ సహారా కప్ లో పోటీపడ్డాయి. అప్పుడు సచిన్ ను స్లెడ్జింగ్ చేశాను. దాంతో సచిన్ నా వద్దకు వచ్చి, నేనెప్పుడూ నీతో అమర్యాదగా ప్రవర్తించలేదు, మరి నువ్వెందుకు నాతో అనుచితంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వెంతో మంచి వ్యక్తివని, ప్రతిభావంతుడైన క్రికెటర్ వని అనుకున్నాను అంటూ సమాధానమిచ్చాడు. సచిన్ ను స్లెడ్జింగ్ చేయడం అదే ఆఖరు. ఆ తర్వాత మరెప్పుడూ నేను సచిన్ జోలికి వెళ్లలేదు" అని తెలిపాడు.

ఇప్పుడు ఆసీస్ క్రికెటర్లు సైతం ఇవే అనుభవాలు వెల్లడించడం చూస్తుంటే, సచిన్ ఎంతో సామరస్యంతో స్లెడ్జింగ్ ను ఎదుర్కొనేవాడని అర్థమవుతోంది. అనవసరంగా బౌలర్ల ఉచ్చులో చిక్కుకోకుండా, తన శాంత వచనాలతో తిరిగి వారినే ఆత్మరక్షణలోకి నెట్టేవాడని తెలుస్తోంది.

More Telugu News